యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతోంది. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి చేపట్టిన క్షేత్రాభివృద్ధి పనులకు కొవిడ్ అడ్డుకట్ట వేస్తోంది. వైరస్ విజృంభణతో భయాందోళనకు గురవుతున్న కార్మికులు సొంతూళ్లకు పయనం కావడంతో పనుల్లో జాప్యం చోటుచేసుకుంటుంది.
విశ్వఖ్యాతి గాంచేలా యాదాద్రి పంచ నారసింహ క్షేత్రాన్ని రూపొందించాలన్న ప్రణాళికకు కరోనా ఆటంకం కలిగిస్తోంది. కార్మికుల లేమితో పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొండపై ఆలయాల విస్తరణ, రక్షణ గోడ, కొండకింద గండి చెరువు వద్ద జరుగుతోన్న పనులతో సహా వీవీఐపీల బస కోసం నిర్మితమవుతోన్న ప్రెసిడెన్షియల్ సూట్ల పనుల నిర్వహణకు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశాతో పాటు కర్ణాటక రాష్ట్రాల నుంచి సుమారు 600 మంది కార్మికులు వచ్చారు.