MP KOMATI REDDY: తెరాస ప్రభుత్వ పతనానికి వరంగల్‌లో నిర్వహించే రాహుల్ సభ నాందీ పలుకుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏడాదిలోపే ఎన్నికలు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. రైతుల తలరాతలు మార్చేలా రూపొందించిన డిక్లరేషన్ సహా... ప్రభుత్వం వస్తే చేపట్టే కార్యక్రమాలను రాహుల్‌గాంధీ ప్రకటిస్తారని చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాహుల్‌గాంధీ పర్యటిస్తారన్న కోమటిరెడ్డి.. ఆయనను అడ్డుకునే హక్కు ఎవరికి లేదని తేల్చిచెప్పారు. వరంగల్ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భువనగిరిలోని గెస్ట్ హౌస్‌లో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
తెలంగాణ ఉద్యమం పుట్టిందే వరంగల్ గడ్డమీద. రైతు వ్యతిరేక ప్రభుత్వమే లక్ష్యంగా రాహుల్ గాంధీ సభ. రైతులకు మేం ఏం చేయబోతున్నామో సభలో వివరిస్తాం. పండించిన పంటను దొడ్డు బియ్యం కొనమని చెప్పి కేంద్రానికి లేఖరాసిన ముఖ్యమంత్రి వరి వేసుకుంటే ఉరి అని చెప్పిండు. కేంద్రంపై పోరాడుతానని పది రోజులు దిల్లీకి వెళ్లిండు. అన్ని ధరలు పెరిగిన సమయంలో తక్కువ ధరకే రైతులు అమ్ముకున్నారు. ఎకరానికి 25 వేల పెట్టుబడి అయింది. ఇప్పటివరకు 20 శాతం కూడా కొనుగోళ్లు పూర్తి కాలేదు. రైతుల తలరాతలు మార్చేలా వరంగల్ డిక్లరేషన్. రైతులు ముఖ్యమా నీకు సెక్రటరియేట్ ముఖ్యమా? - కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎంపీ