తెలంగాణ

telangana

ETV Bharat / state

'నీటి కుంటలను అధికార పార్టీ నేతలు కబ్జా చేస్తున్నారు' - yadadri bhuvanagiri district news

యాదాద్రి భువనగిరి జిల్లా మల్కాపురం రెవెన్యూ పరిధిలోని తెట్టకుంట చెరువును అధికార పార్టీ నాయకులు, రియల్​ ఎస్టేట్​ వ్యాపారులు కబ్జాచేశారని కాంగ్రెస్​ నేతలు ఆరోపించారు. వెంటనే వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. లేకుంటే కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.

congress leaders spoke on land grabbing in yadadri bhuvanagiri district
'నీటి కుంటలను అధికార పార్టీ నేతలు కబ్జా చేస్తున్నారు'

By

Published : Aug 21, 2020, 7:22 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మల్కాపురం రెవెన్యూ పరిధిలోని తెట్టకుంట చెరువును అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారని కాంగ్రెస్​ పార్టీ నేతలు ఆరోపించారు. మల్కాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని బద్దుతండా పంచాయతీ పరిధిలో గల సర్వే నంబర్లు 72, 81, 82 లో సుమారు రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉందన్నారు. ఈ చెరువు ప్రధాన రహదారి పక్కనే ఉండటం వల్ల కేవలం గ్రామ ప్రజలకే కాకుండా, ప్రయాణీకులకు తరతరాలుగా ఎంతో ప్రయోజనం చేకూర్చేవిధంగా ఉందన్నారు. ఈ చెరువును గత వారం, పది రోజులుగా అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకుల అండదండలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు భారీ వాహనాలతో విధ్వంసం చేసి, కబ్జా చేస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్య రెడ్డి, తుర్కపల్లి మండల కాంగ్రెస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ వెంకటేశ్​ గౌడ్​ ఆరోపించారు.

ఇరిగేషన్ శాఖ ఈఈ, డీఈ, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా... ఎలాంటి చర్య తీసుకోలేదన్నారు. అడ్డువచ్చిన స్థానిక గిరిజనులపై అధికార పార్టీకి చెందిన నేతలు బెదిరింపులకు పాల్పడున్నారని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి చెరువును కాపాడాలని కోరారు. కబ్జాకు పాల్పడిన వారితోనే చెరువు కట్టను పునర్నిర్మాణం చేయించాలని అన్నారు. కబ్జాదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. లేనిచో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని బోరెడ్డి అయోధ్యరెడ్డి హెచ్చరించారు.

తెట్టకుంట చెరువును కబ్జా చేసినట్లు తమకు బద్దుతండా సర్పంచ్​, స్థానిక నాయకులు ఫిర్యాదు చేశారని స్థానిక తుర్కపల్లి తహసీల్దార్​ చెప్పారు. కబ్జా చేసిన వారిపై సంబంధిత ఇరిగేషన్ శాఖ సహాయంతో తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి: చెరువులు మాయమైనందు వల్లే వరంగల్లో వరదలు!

ABOUT THE AUTHOR

...view details