యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలిక కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక... రసాభాసగా మారింది. సాఫీగా సాగిపోతుందనుకున్న ఎంపిక ప్రక్రియ... అధికార పార్టీ సభ్యురాలు.. ప్రత్యర్థి వర్గంలో చేరడం ఫలితంగా గొడవకు దారితీసింది.
నలుగురు కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం... 21 మందితో కూడిన పురపాలిక సమావేశమైంది. తెరాస, సీపీఎంకు 11 మంది బలం ఉండగా... కాంగ్రెస్ 5, భాజపా 3, ఒక స్వతంత్రుడు, ఎక్స్-అఫిషియో సభ్యుడైన ఎమ్మెల్యేతో కలిపి ఆ కూటమికి 10 మంది సభ్యుల బలం ఉంది. సమావేశ సమయంలో తెరాస సభ్యురాలు.. ప్రత్యర్థి వర్గంలో చేరికతో గొడవ మొదలైంది. తమ సభ్యురాల్ని వెనక్కి రప్పించేందుకు... ఛైర్మన్ రాజు.. శతథా యత్నించారు. దీనిపై ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఛైర్మన్, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఇరువర్గాల సభ్యులూ ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగడం వల్ల.. పరిస్థితి కాసేపు ఉద్రిక్తంగా మారింది. తమకు పూర్తి ఆధిక్యం ఉందని ఎన్నిక కోసం ఎమ్మెల్యే పట్టుబట్టడం... అనైతిక చర్యగా పేర్కొంటూ తెరాస నిరసనకు దిగడంతో గందరగోళం నెలకొంది.