యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న ప్రధానాలయం పునర్నిర్మాణ పనులను సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనుల తీరుపై వైటీడీఏ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వచ్చిన నాటి నుంచి నేటి వరకు పనుల్లో ఎటువంటి మార్పు రాలేదని అధికారులపై మండిపడ్డారు. శుక్రవారం ఉదయం10 గంటలకు వచ్చిన ఆయన దాదాపు మూడు గంటల పాటు నిర్మాణ పనులను పరిశీలించారు.
యాదాద్రిలో సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి... వైటీడీఏ అధికారులపై ఆగ్రహం
యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలిలించిన సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి... ముందుగా బాలాలయంలో స్వామి వారిని దర్శించుకొని... ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనుల పరిశీలించారు.
ప్రధాన ఆలయం, శివాలయం, రాజ గోపురాలు, తిరుమాడ వీధులు, గర్భాలయం ఆలయ ప్రాకారాలు, ఫ్లోరింగ్ మరమ్మతులు, విష్ణు పుష్కరిణి వంటి నిర్మాణాలను ఆయన అధికారులతో కలసి నిశితంగా పరిశీలించారు. ఆలయ పనులను పరిశీలిస్తూ.. వైటీడీఏ అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు ముందుకు సాగవా ఇంకా ఎన్నాళ్లు ఇలా చేస్తారు అంటూ.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ తిరు వీధులలో కృంగిన ఫ్లోరింగ్ బండలను, భూగర్భ డ్రైనేజీ, మురుగు నీరు పారుదల, ఫ్లోరింగ్ వంటి పనులను చూసి పనులలో కాలయాపన చేయకుండా ఎన్ని సంవత్సరాలు చేస్తారు అంటూ.. ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం గర్భాలయంలోకి వెళ్లి అక్కడ జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పనులలో జాప్యం జరిగినా నాణ్యత లోపించిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆలయ పనులు పరిశీలన అనంతరం కొండపైన హరిత టూరిజంలో అధికారులతో సమీక్షా సమావేశం జరిపారు. సమీక్షలలో, యాడా అధికారులు, వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్ రావు, ఆలయ ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి, జిల్లా కలెక్టర్ అనితరామచంద్రన్, స్థపతి ఆనందచారి వేలు, సహాయ స్థపతులు, శిల్పులు ఉన్నారు.