అద్భుత శిల్పకళ సంపదతో రూపుదిద్దుకుంటున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు. ఆలయ పునర్నిర్మాణ పనులను పూర్తిస్థాయిలో ఐదున్నర గంటలపాటు పరిశీలించారు. హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్‌లో పెద్దగుట్టపైన ఆలయనగరికి చేరుకున్న సీఎం అక్కడి నుంచి బాలాలయానికి వెళ్లారు. ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కేసీఆర్‌కు ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందించి.. స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ప్రధానాలయ ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. ఉత్తరం వైపున పచ్చదనం కోసం చేపట్టిన పనులను పరిశీలించారు. కొండపైనున్న ప్రత్యేక క్యూలైన్ల నిర్మాణాలను గమనించారు. ఆర్కిటెక్ట్ ఆనందసాయి, స్థపతి ఆనందసాయి వేలు, ఈవో గీతారెడ్డి పనులకు సంబంధించిన వివరాలు ముఖ్యమంత్రికి తెలియజేశారు. యాదాద్రి ఆలయ ప్రాంగణమంతా కలియదిరిగిన సీఎం... పునర్నిర్మాణాలను పరిశీలిస్తూ పలు సూచనలు చేశారు. గర్భాలయ తుది దశ పనులపై ఆరా తీశారు. ప్రాంగణం బయట బ్రహ్మోత్సవ మండలం, మాడ వీధుల్లోని విద్యుద్దీపాలు, తూర్పు రాజగోపురం వద్ద క్యూలైన్లు పరిశీలించారు. అక్కడ చేపట్టాల్సిన పనులపై... ఆలయ స్తపతి ఆనందాచారి వేలుకు సీఎం కొన్ని సూచనలు చేశారు.
తూర్పు రాజగోపురం నుంచి గర్భాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. అంతర్భాగంలో చేపట్టిన నిర్మాణాలను వీక్షించారు. మాడ వీధులు, ప్రాకార మండపంలో నిర్మించిన అద్దాల మండపం... పడమటి రాజగోపురం వద్ద వేంచేపు మండపం పరిశీలించారు. గర్భాలయ ప్రాంగణంలో ఇప్పటివరకు జరిగిన పనుల తీరును అడిగి తెలుసుకున్నారు. భక్తులు వైకుంఠ పుణ్యక్షేత్రంలోకి వచ్చిన అనుభూతి కలిగేలా తుది మెరుగులు దిద్దాలని సూచించారు. దేశంలోని ఆలయాలకు ఆదర్శంగా యాదాద్రి వుండాలని.. మూల విరాట్టు స్వామి సేవలు దూరం నుంచి కూర్చొని చూసినా... కనిపించేలా వుండాలన్నారు. అనంతరం కొండ దిగువన చేపట్టిన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. రింగ్‌రోడ్ నిర్మాణంతో పాటు ఇతర పనులు పరిశీలించారు.