'యాదాద్రి ఆలయానికి అనుబంధంగా జరిగే నిర్మాణాల్లో ఆధ్యాత్మిక శోభ విలసిల్లాలి' CM KCR YADADRI TOUR: యాదాద్రి ప్రధానాలయం ఉద్ఘాటన తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు. రోడ్డుమార్గంలో హైదరాబాద్ నుంచి యాదాద్రి చేరుకున్నారు. యాదాద్రి గుట్ట చుట్టూ వాహనంలో గిరి ప్రదక్షిణ చేశారు. ప్రెసిడెన్షియల్ సూట్స్‌లో యాడా అధికారులతో సమీక్ష నిర్వహించారు. యాదాద్రి ఆలయానికి అనుబంధంగా జరిగే నిర్మాణాలు ఆధ్యాత్మిక శోభ విలసిల్లేలా జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. యాదాద్రి అభివృద్ధి కోసం రూ.43 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఫోన్‌లో ఆదేశించారు.
వైటీడీఏకు 2,157 ఎకరాల భూమిని రెవెన్యూ శాఖ పూర్తిస్థాయిలో అప్పగిస్తుందని, నిర్వహణను వైటీడీఏ అధికారులు చూసుకోవాలని కేసీఆర్ సూచించారు. ఈ భూమిని ఆలయ అవసరాలు, పోలీస్‌శాఖ, అగ్నిమాపక కేంద్రం, హెల్త్, రవాణా, పార్కింగ్ వంటి యాదాద్రి అభివృద్ధికి సంబంధించిన అనుబంధ సేవల కోసమే వినియోగించాలని సూచించారు.
ఆలయ వైభవాన్ని ప్రతిబింబించేలా ఉండాలి..: యాదాద్రి ఆలయ నగరితో పాటు ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న కాటేజీల నిర్మాణం ఆలయ వైభవాన్ని ప్రతిబింబించేలా ఉండాలని సీఎం అన్నారు. దాతలు కాటేజీల నిర్మాణం కోసం ఇచ్చే విరాళాలకు ఆదాయ పన్ను మినహాయింపునకు సంబంధించిన 80జీ అనుమతులు వెంటనే తీసుకోవాలని అధికారులకు సూచించారు. హెలీప్యాడ్‌ల నిర్మాణం కూడా చేపట్టాలన్నారు. వైటీడీఏ సమీపంలో జరిగే ప్రైవేట్ నిర్మాణాలకు, జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే అధికారులు అనుమతులివ్వాలన్నారు. వైటీడీఏ పరిధిలో ఉన్న 100 ఎకరాల అడవిని 'నృసింహ అభయారణ్యం' పేరిట అద్భుతంగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
చుక్క నీరు నిలబడకుండా డ్రైనేజీ వ్యవస్థ ఉండాలి..: 50 ఎకరాల్లో అమ్మవారి పేరు మీద అద్భుతమైన కల్యాణ మండపం నిర్మాణం చేపట్టాలన్నారు. ఆలయం సహా రింగు రోడ్డు మధ్యలో ఏ ప్రాంతంలోనూ ఒక్క చుక్క నీరు నిలబడకుండా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. క్యూలైన్లు సహా ఇతర అన్నిచోట్ల ఎలాంటి చిన్న ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. 250 ఎకరాల్లో నిర్మించే 250 కాటేజీలను నాలుగు భాగాలుగా విభజించి, నాలుగు రకాల ఆధ్యాత్మిక డిజైన్లతో నిర్మించాలని సూచించారు. ఆలయ ఆదాయం, ఖర్చుల ఆడిటింగ్ వ్యవస్థ అత్యంత పారదర్శకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆలయ నిర్వహణ కోసం నిధులు నిల్వ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.
బంగారు తాపడానికి సీఎం విరాళం..: అనంతరం ఆలయం వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్ దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎం దంపతులు స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కేసీఆర్ కుటుంబం తరఫున మనవడు హిమాన్షు యాదాద్రీశునికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ గోపురానికి బంగారు తాపడం కోసం కిలో 16 తులాల బంగారానికి సంబంధించిన రూ.52.48 లక్షల చెక్కును హిమాన్షురావు చేతుల మీదుగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి, ఆలయ అధికారులకు అందజేశారు. యాదాద్రి ఆలయ గోపురానికి బంగారు తాపడం కోసం ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి కిలో బంగారం కోసం రూ.50 లక్షల 15 వేల చెక్కు, తెరాస రాష్ట్ర నాయకులు వేంరెడ్డి నర్సింహరెడ్డి రూ.51 లక్షల చెక్కు, ఏనుగు దయానంద్‌రెడ్డి కిలో బంగారం కోసం రూ.50 లక్షల 4 వేల చెక్కును అధికారులకు అందజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయ ప్రాంగణంలో కలియతిరుగుతూ నిర్మాణాలపై పలు సూచనలు చేశారు.
ఇవీ చదవండి: