ముఖ్యమంత్రి కేసీఆర్(Telangana CM KCR) కాసేపట్లో యాదాద్రికి రానున్నారు. శ్రీలక్ష్మీ నరసింహుడి ఆలయ పునర్నిర్మాణ పనుల(Yadadri Temple)ను పరిశీలించనున్నారు. సీఎం పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం పదకొండున్నరకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా యాదాద్రికి రానున్న కేసీఆర్.... ప్రధానాలయం ప్రాంగణంలోని అతిథి గృహంలో అధికారులతో చర్చించనున్నారు. అనంతరం బాలాలయంలో ప్రత్యేక పూజల చేసి ప్రధానాలయం పనులు పరిశీలించనున్నారు. నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఆలయ ఉద్గాటన చేపట్టాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఈ మేరకు సీఎం చినజీయర్ స్వామిని కలిసి ఆలయ ప్రారంభం పై చర్చించారు. ఆలయ ఉద్ఘాటనకు ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం. నేటి పర్యటనలో ఆలయ ఉద్గాటన తేదీని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. మహా సుదర్శన యాగం తేదీలను కూడా ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు..
తుదిదశకు చేరుకున్న నిర్మాణ పనులు
క్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం పుణ్యస్నానాల కోసం... కొండ కిందనున్న గండిచెరువు వద్ద 2.20 ఎకరాల్లో లక్ష్మీ పుష్కరిణి రూపొందింది. 11.55 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులు... 85 శాతం పూర్తయ్యాయి. ఇప్పటికే అందులో నీటిని నింపి ట్రయల్ రన్ పూర్తి చేశారు. భక్తుల బస కోసం 18 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో... రూ.8.35 కోట్లతో నిర్మిస్తున్న మండప భవనం పనులు 95 శాతం పూర్తయ్యాయయాయి (yadadri development works) రూ.20.30 కోట్లతో 2.23 ఎకరాల్లో చేపట్టిన కల్యాణకట్ట తుది దశకు చేరుకుంటుండగా... ఆర్నమెంటల్ పనులు, 2.59 కిలోమీటర్ల అంతర్గత రహదారుల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండప నిర్మాణంలో పునాదుల పనులు జరుగుతున్నాయి. క్షేత్ర సందర్శనకు వచ్చే దేశ, విదేశీయుల విడిది కోసం... దాతల విరాళాలు రూ.104 కోట్లతో నిర్మితమవుతున్న ప్రెసిడెన్షియల్ సూట్లలో 14 విల్లాలు, ఒక ప్రెసిడెన్షియల్ భవనం పూర్తయింది.