వరంగల్ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) యాదాద్రి (Yadadri) క్షేత్రాన్ని సందర్శించారు. వరంగల్ నుంచి హెలికాప్టర్ ద్వారా సాయంత్రం 6:18 నిమిషాలకు ఆలయ నగరికి చేరుకున్న ఆయన... తొలుత గండిచెరువు ప్రాంగణం వద్ద వలయ రహదారిలో నిర్మాణాలు పరిశీలించారు. అనంతరం శ్రీ లక్ష్మీనృసింహ స్వామివార్లను... దర్శించుకున్నారు.
బాలాలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. ఆయన సువర్ణ పుష్పార్చన పూజలు చేశారు. సీఎం వెంట మంత్రులు జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, జోగినపల్లి సంతోశ్ కుమార్, గొంగిడి సునీత ఉన్నారు.
బాధితులతో ముచ్చట...
యాదాద్రి క్షేత్ర సందర్శనలో ముఖ్యమంత్రి కేసీఆర్... వైకుంఠ ద్వారం వద్ద ఆగి రహదారి విస్తరణ బాధితులతో ముచ్చటించారు. 20 నిమిషాల పాటు మాట్లాడిన సీఎం... బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధాన రహదారి వెంట గల భవనాలు, ఇళ్ల కూల్చివేతల్ని పరిశీలించారు. గిరి ప్రదక్షిణ దారిలోని నక్షత్ర వనం ప్రాంతంలో నిర్మితమవుతోన్న... పై వంతెన పనుల్ని పరిశీలించారు. అనంతరం కొండపైకి చేరుకున్నారు. కల్యాణకట్ట, పుష్కరిణి, దీక్షాపరుల మండపం తదితర కట్టడాల గురించి వివరాలు తెలుసుకున్నారు. కొండ చుట్టూ గల వలయ రహదారిని... సాంతం వీక్షించారు.