వారానికి రెండుగంటల పాటు కష్టపడితే బంగారు వాసాలమర్రి (Vasalamarri)ని తయారు చేసుకోవచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా దత్తత గ్రామం వాసాలమర్రి(Vasalamarri)లో సీఎం పర్యటించారు. గ్రామాభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. వారానికి రెండు గంటలు ప్రతి ఒక్కరూ పనిచేసేలా శ్రమదాన కమిటీని తయారు చేసుకోవాలన్నారు.
ఊరంతా కలిస్తేనే అభివృద్ధి... పరిశుభ్రత, తాగునీరు, వ్యవసాయం ఇలా అన్నింటికీ కమిటీలు ఏర్పడితే అభివృద్ధి చెందడం కష్టం కాదని ముఖ్యమంత్రి (Cm Kcr) అన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట 18 నిమిషాలకు పల్లెకు చేరుకున్న ఆయన... గ్రామసభ వేదిక పైనుంచి అభివాదం చేసిన అనంతరం గ్రామస్థులందరితో సహపంక్తి భోజనం చేశారు. రెండు గంటల పాటు భోజనశాల వద్దే గడిపారు.
వారితో భోజనం...
ఆకుల ఆగమ్మ అనే వృద్ధురాలిని, చెన్నూరు లక్ష్మీని పక్కన కూర్చోబెట్టుకుని భోజనం చేశారు. అంతకుముందు భోజనం కోసం ఏర్పాటు చేసిన ప్రాంతం మొత్తం తిరిగి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. టేబుళ్ల వద్ద కూర్చున్న ప్రతి ఒక్కర్నీ పలుకరిస్తూ... భోజనం చేయాల్సిందిగా కోరారు. తమను సీఎం పలకరించడంతో పలువురు తన్మయత్వం చెందారు. తమ సమస్యల్ని మరికొందరు సీఎంకు తెలియజేశారు. పక్కన కూర్చున్న మహిళలకు కేసీఆర్ (Cm Kcr) స్వయంగా వడ్డించారు.
అంతా ఊరికోసం పనిచేయాలి...
మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషాలకు సభపైకి చేరుకున్న సీఎం... గ్రామస్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఎవరికివారు నాకేం పని అనుకోకుండా అంతా ఊరి బాగు కోసం పనిచేయాలని ముఖ్యమంత్రి (Cm Kcr) అన్నారు. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ విజయగాథను వివరిస్తూ... అక్కడి గ్రామాభివృద్ధి కమిటీ వీడీసీయే సుప్రీం అంటూ రెండుమూడు సార్లు సర్పంచికే 2 లక్షల వరకు జరిమానా వేశారని తెలియజేశారు. అంకాపూర్ వీడీసీ స్ఫూర్తిగా సమీప ప్రాంతాల్లో 300 గ్రామాలు అభివృద్ధి కమిటీలు వేసుకుని పురోగతి సాధించాయని తెలిపారు.
రెండు గంటలపాటు...
కులం, మతం అనే తేడా లేకుండా వారానికి రెండు గంటలపాటు అభివృద్ధికి తోడ్పడాలని కేసీఆర్ సూచించారు. ఏడాదిలోగా ప్రస్తుతమున్న ఊరిని బంగారు వాసాలమర్రి(Vasalamarri)గా మారుస్తానని... గ్రామ వాసులకు భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో ఈ ఊరు ఎన్నో గ్రామాలకు స్ఫూర్తిగా నిలవాలని అందుకనుగుణంగా గ్రామస్థులంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ఊళ్లో కేసులుంటే త్వరితగతిన స్థానికంగానే పరిష్కరించుకోవాలని... ఇందుకు పోలీసు ఉన్నతాధికారులు సహకరించేలా చేస్తానని మాట ఇచ్చి వేదికపై నుంచే అధికారులకు సూచనలు చేశారు.
బంగారు వాసాలమర్రిపై దిశానిర్దేశం దేవుడే చెప్పాడేమో...
గతేడాది వరంగల్ నుంచి వస్తూ ఈ ఊరిని చూసి అక్కడే నలుగురైదుగురితో మాట్లాడానన్న సీఎం(Cm Kcr)... వాసాలమర్రిని బాగు చేయాలని దేవుడు చెప్పాడేమో అందుకే నా దృష్టి దీనిపై పడిందని వ్యాఖ్యానించారు. వాసాలమర్రి(Vasalamarri) అభివృద్ధికి ప్రభుత్వం తరఫున కలెక్టర్ పమేలా సత్పతిని ప్రత్యేకాధికారిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. గ్రామంలో ప్రతి కుటుంబం వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. అంతకుముందు సర్పంచితోపాటు 40 మంది వచ్చి సీఎంను కలిశారు.
వాసాలమర్రి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం యాదాద్రికి వరాలు...
యాదాద్రి జిల్లాపై ముఖ్యమంత్రి (Cm Kcr) వరాలు కురిపించారు. మొత్తం 421 గ్రామాలకు గాను ప్రతి గ్రామపంచాయతీకి సీఎం నిధి నుంచి రూ. 25 లక్షల చొప్పున... ఆరు పురపాలికలకు గాను జిల్లా కేంద్రమైన భువనగిరికి రూ. కోటి... మిగతా అయిదింటికి రూ. 50 లక్షల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. చదువుకున్న మహిళలు పిడికిలి బిగించాలని... ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులు గ్రామ కమిటీల ఏర్పాటుపై చైతన్యం కలిగించాలని కేసీఆర్ కోరారు.
బంగ్లాదేశ్ ప్రొఫెసర్ గురించి వివరిస్తున్న కేసీఆర్ ఇదీ చూడండి: Cm Kcr: దత్తత గ్రామంలో సీఎం పర్యటన... గ్రామస్థులతో సహపంక్తి భోజనం