CM KCR Yadadri Tour: నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా.. మధ్యాహ్నం 12 గంటలకు యాదాద్రి వెళ్లనున్నారు. యాదాద్రిలో నూతనంగా నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్స్ ప్రారంభిస్తారు. యాదాద్రిలో నిర్మిస్తోన్న యాగశాలను పరిశీలించనున్నారు. ఒకటిన్నరకు భువనగిరికి సీఎం వెళ్తారు. భువనగిరి శివారులోని రాయగిరిలో నూతనంగా నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్షిస్తారు. ఆ తర్వాత.. 3.30కు పట్టణంలోని జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. సాయత్రం 4 గంటలకు రాయగిరిలో కలెక్టరేట్ పక్కనే నిర్వహించనున్న బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు.
సభ విజయవంతం చేసేందుకు కసరత్తు..
సీఎం పర్యటన దృష్ట్యా మంత్రి జగదీష్‌రెడ్డి.. స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కలెక్టరేట్ సుందరీకారణ పనులను ఎప్పటి కప్పుడు సమీక్షించారు. అధికారులకు దిశా నిర్దేశం చేశారురు. సీఎం కేసీఆర్ సభకు సుమారు లక్షా పది వేల మంది వస్తారని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. అందుకు తగ్గట్టు సభా స్థలి వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా తెరాస ఆధ్వర్యంలో సీఎం భారీ బహిరంగ సభ విజయవంతం చేయడానికి కమిటీలు, ఇంఛార్జిలను నియమించారు. జన సమీకరణకు నాయకులకు బాధ్యతలు అప్పగించారు.