కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదాయం తగ్గటం వల్ల కొన్ని పథకాల అమలు పెండింగ్‌లో ఉందని... ఏదిఏమైనా దళితబంధు పథకం అమలుచేసి తీరుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. దత్తత గ్రామంలో పర్యటించిన సీఎం కేసీఆర్... వాసాలమర్రి గ్రామంలో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో ఎర్రవల్లి గ్రామం పరిస్థితి కూడా అస్తవ్యస్తంగా ఉండేదని... ఎర్రవల్లిలోని ఇళ్లన్నీ పడగొట్టి కొత్త ఇళ్లు నిర్మించి ఇచ్చామని వెల్లడించారు. గ్రామస్థులను 6 నెలలు గుడారాల్లో ఉంచి ఇళ్లు నిర్మించి ఇచ్చామని తెలిపారు.
అందరికీ దళితబంధు
వాసాలమర్రిలో 76 దళిత కుటుంబాలు ఉన్నాయని... గ్రామంలో 100 ఎకరాలకు పైగా మిగులుభూమి ఉందన్నారు. ప్రభుత్వ మిగులు భూమిని ఎస్సీలకు పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు దళితబంధు మంజూరు చేస్తామని ప్రకటించారు.
వాసాలమర్రిలో నూతన చరిత్ర ప్రారంభం కావాలి. దళితుల భూములు ఎక్కడెక్కడ ఉన్నా ఏకీకరణ చేస్తాం. అది ఈ ఊరినుంచే ప్రారంభిద్దాం. రాష్ట్రంలో దళితుల కుటుంబాలు సుమారు 16 లక్షల వరకు ఉన్నాయి. వారందిలో మీరు అదృష్టవంతులు. ఎందుకంటే మీ గ్రామం నేను దత్తత తీసుకున్నాను కాబట్టి. వాసాలమర్రిలో ఉన్న 76 కుటుంబాలకు దళితబంధు మంజూరు చేస్తాం. రేపటి నుంచే మీఖాతాల్లో డబ్బులు ఉంటాయి. ఈ డబ్బు నీరుగారిపోవద్దు. ఈ డబ్బుతో మీరు నిలబడాలి. ఎవరికైతే దళితబంధు వస్తుందో.. వారికొచ్చిన రూ. 10లక్షల నుంచి ప్రభుత్వం రూ. 10వేలు తగ్గిస్తుంది. ఆ మొత్తానికి మరో పదివేలు జతచేసి ఒక్కో కుటుంబానికి రూ. 20వేలు చొప్పున నియోజకవర్గం వ్యాప్తంగా దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తాం. ఎవరికైతే అనుకోకుండా ఏ కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా ఈ నిధి ఉపయోగపడుతుంది. మరొక ఆరు నెలల తర్వాత వాసాలమర్రికి వచ్చినప్పుడు దళితవాడలోనే భోజనం చేస్తాను. పట్టుబడితే జట్టుకడితే... వాసాలమర్రి బంగారు వాసాలమర్రి అవుతుందని చెప్పానో అది జరిగి తీరాలి. మొత్తం తెలంగాణలో మీరే మొదటి బిడ్డలు. దళితబంధు ఇక్కడే ప్రారంభమైంది. హుజూరాబాద్‌లో అయ్యేది ఇక లాంఛనమే..- కేసీఆర్, ముఖ్యమంత్రి
ఎన్నో పోరాటాలు చేసి స్వరాష్ట్రం సాధించుకున్నామన్న ముఖ్యమంత్రి కేసీఆర్... ఈ ఆరేళ్లల్లో ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నామని తెలిపారు. ప్రస్తుతానికి విద్యుత్, తాగునీరు, సాగునీరు సమస్య తీరిందని వెల్లడించారు. కులవృత్తులపై ఆధారపడిన వారిని ఎన్నో రకాలుగా ఆదుకుంటున్నామన్నారు.
'వాసాలమర్రిలో 76 ఎస్సీ కుటుంబాలకు రేపట్నుంచి దళితబంధు' ఇదీ చూడండి:CM KCR TOUR: కాలినడకన వాసాలమర్రిలో వీధివీధిని పరిశీలించిన కేసీఆర్