CM KCR Nalgonda tour నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రం పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. హైదరాబాద్ నుంచి రెండు హెలికాప్టర్లలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్లాంట్ వద్దకు వెళ్లారు. తొలుత ప్లాంట్‌ఫేజ్-1లోని యూనిట్-2 బాయిలర్ నిర్మాణ ప్రదేశానికి వెళ్లిన సీఎం... 82 మీటర్ల ఎత్తులోని 12వ ఫ్లోర్ చేరుకొని నిర్మాణపనులు పరిశీలించారు. ప్లాంట్‌నిర్మాణం జరుగుతున్న తీరుపై ట్రాన్స్‌కో, జెన్‌కో, బీహెచ్‌ఈఎల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఆ ఉద్దేశ్యంతోనే దామరచర్ల ఎంపిక: పవర్‌ప్లాంట్‌కి సంబంధించి ఏర్పాటు చేసిన డిస్‌ప్లే బోర్డులను సీఎం పరిశీలించారు. ప్లాంట్‌లో కనీసం 30 రోజులకు అవసరమైన బొగ్గునిల్వలు ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. కీలకమైన విద్యుత్ ప్రాజెక్ట్‌విషయంలో బొగ్గు నిల్వలు సహా ఇతర నిర్వహణలో అధికారులు ముందుచూపుతో వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాలకు విద్యుత్ కనెక్టివిటీ ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పవర్ ప్లాంట్‌కు ప్రతిరోజు బొగ్గు, నీరు, ఎంత అవసరమనే విషయంపై సీఎం ఆరాతీశారు. నీటిసరఫరాకు కృష్ణాఋ నీటిని సరఫరాచేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కృష్ణపట్నం పోర్టు, అద్దంకి హైవేను దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల ఉపాధి కల్పించే ఉద్దేశ్యంతో పవర్ ప్లాంటుకు దామరచర్లను ఎంపిక చేసినట్లు తెలిపారు.
100 ఎకరాలు సేకరించండి: విద్యుత్ కేంద్రంలో పనిచేసే సుమారు 10వేలమంది సిబ్బందికి ఉపయోగపడేలా అద్భుతమైన టౌన్‌షిప్ నిర్మాణంచేయాలని కేసీఆర్ ఆదేశించారు. అక్కడే భవిష్యత్‌లో సౌర విద్యుత్ ప్లాంట్ చేపట్టనున్నందున సిబ్బంది ఇంకా పెరుగుతారని అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సిబ్బంది క్వార్టర్స్ ఇతర సదుపాయాల కోసం ప్రత్యేకంగా 100 ఎకరాలు సేకరించాలని సీఎం సూచించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కి 50 ఎకరాలు కేటాయించాలన్న సీఎం.. ఇతర అవసరాలకు మరో 50 ఎకరాలు వినియోగించాలని చెప్పారు. పవర్‌ప్లాంట్ సిబ్బందికి సేవలందించే ప్రైవేట్‌సర్వీస్ ఉద్యోగులకు అవసరమైన క్వార్టర్స్ నిర్మాణం చేపట్టాలని చెప్పారు. దామరచర్ల హైవే నుంచి వీర్లపాలెం పవర్ ప్లాంట్‌వరకు 7 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రోడ్డు మంజూరు చేయాలని కార్యదర్శి స్మితాసబర్వాల్‌ను సీఎం ఆదేశించారు. రైల్వేక్రాసింగ్ వద్ద ఆర్వోబీ నిర్మాణంతో పాటు దామరచర్ల రైల్వే స్టేషన్ విస్తరణకు రైల్వే శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.