తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆలయంలో తైలవర్ణ చిత్రాలు వేయించండి: సీఎం కేసీఆర్​ - తైలవర్ణ చిత్రాలు

యాదాద్రి ఆలయ నిర్మాణ పనులన్నీ పూర్తి నాణ్యతా ప్రమాణాలతో.. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. శాశ్వతంగా నిలిచిపోయే ఆలయ పునరుద్ధరణ పనుల్లో ఎలాంటి తొందరపాటు, ఆతృత అవసరం లేదన్నారు. ప్రధాన ఆలయంలో జరుగుతున్న నిర్మాణాలన్నీ ఆధ్యాత్మికత, ధార్మికత ఉట్టిపడేలా ఉన్నాయని  సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. లక్షలాది భక్తులకు దైవదర్శనం, వసతుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

సీఎం ఆదేశం
ఆలయంలో తైలవర్ణ చిత్రాలు వేయించండి

By

Published : Dec 17, 2019, 9:16 PM IST

ఆలయంలో తైలవర్ణ చిత్రాలు వేయించండి: సీఎం
యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరున్నర గంటలు పర్యటించారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి రహదారి మార్గంలో గుట్టకు చేరుకున్న సీఎం.. మొదట లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రెండు గంటల పాటు ప్రధాన ఆలయ నిర్మాణ ప్రాంతంలో కలియ తిరిగారు. గోపురాలు, మాడవీధులు, ప్రాకారాలు, గర్భగుడి, ధ్వజస్తంభం, శివాలయం, క్యూలైన్లు, ప్రసాదం వంటశాల, పుష్కరిణి, యాగశాల తదితర నిర్మాణాలన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించారు.

తొందరపాటు అవసరం లేదు

యాదాద్రి ప్రధాన ఆలయంలో జరుగుతున్న నిర్మాణాలన్నీ ఆధ్యాత్మికత, ధార్మికత ఉట్టిపడేలా ఉన్నాయని ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణ పనులు ఒక గడువు విధించుకొని పూర్తి చేసేవి కావన్న ఆయన... శాశ్వతంగా ఉండాల్సిన నిర్మాణాలైనందున ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గర్భగుడి ఆకారం, ప్రాశస్త్యం చెక్కు చెదరకుండా నిర్మాణాలు సాగాలన్న కేసీఆర్... ఏ మాత్రం తొందరపాటు అవసరం లేదని వ్యాఖ్యానించారు. జాగ్రత్తతో పూర్తి నాణ్యతా పాటించాలని.. నిర్మాణాలు పటిష్ఠంగా ఉండాలని స్పష్టం చేశారు. ఆగమ శాస్త్ర నియమాలను అనుసరించే పనులన్నీ సాగాలని సీఎం తెలిపారు.

నాలుగేళ్ల కష్టం ఫలించింది..

సనాతన ఆలయమైన యాదగిరిగుట్ట గుడిలో పూజలు చేయడం చాలా మందికి వారసత్వంగా వస్తున్న సాంప్రదాయమని కేసీఆర్​ అన్నారు. దేశవిదేశాల్లో లక్ష్మీనర్సింహ స్వామికి ఉన్న లక్షలాది భక్తులు రాబోయే కాలంలో యాదాద్రికి తరలి వస్తారని.. వారందరికీ దైవ దర్శనం, వసతిసౌకర్యాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేయడమే లక్ష్యం కావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాతి శిలలను అద్భుత కళాకండాలుగా మలిచారని శిల్పులను అభినందించారు. ఆలయ ప్రాంగణమంతా దేవతా మూర్తుల విగ్రహాలతో నిండేలా రూపకల్పన చేశారని ప్రశంసించారు. 560 మంది శిల్పులు నాలుగేళ్లుగా పడుతున్న కష్టం ఫలించి అద్భుత ఆకారాలతో కూడిన ప్రాకారాలు సిద్ధమయ్యాయన్నారు. పూర్తిగా శిలలనే ఉపయోగించి దేవాలయాన్ని తీర్చిదిద్ధడం యాదాద్రిలోనే సాధ్యమయిందని తెలిపారు.

రాష్ట్రపతి, ప్రధానికి సౌకర్యంగా ఉండేలా..

ఆలయ ప్రాంగణంలో పచ్చదనం ఉండేలా, ఆహ్లాదం పంచేలా ఉద్యానవనాలు పెంచాలని సీఎం సూచించారు. ఆలయ ప్రాంగణంలో దేవాలయ ప్రాశస్త్యం, లక్ష్మీనర్సింహస్వామి చరిత్ర, స్థలపురాణం ప్రస్ఫుటించేలా తైలవర్ణ చిత్రాలను వేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అనంతరం యాదాద్రిలో జరుగుతున్న రింగురోడ్డు పనులను కేసీఆర్ పరిశీలించారు. సకల సౌకర్యాలతో కూడిన 15 వీవీఐపీ కాటేజీలతో నిర్మిస్తున్న ప్రెసిడెన్షియల్ సూట్​ను పరిశీలించి అక్కడ కొన్ని మార్పులు సూచించారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి లాంటి వారు వచ్చినా.. పూర్తి సౌకర్యంగా ఉండేలా సూట్ ఉండాలన్నారు.

బస్వాపురం జలాశయాన్ని పర్యటక ప్రాంతంగా మారుస్తున్నట్లే... ప్రెసిడెన్షియల్ సూట్ సమీపంలోని మైలార్ గూడెం చెరువును కూడా సుందరీకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రధాన దేవాలయం ఉండే గుట్ట నుంచి రింగురోడ్డు మధ్య భాగంలో గతంలో అనుకున్న ప్రకారమే నిర్మాణాలన్నీ జరగాలన్న కేసీఆర్... కోనేరు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.

ఇవీ చూడండి: యాదాద్రిలో 45 నిమిషాల పాటు సాగిన కేసీఆర్​ సమీక్ష

For All Latest Updates

TAGGED:

kcr review

ABOUT THE AUTHOR

...view details