Bhatti Vikramarka Padayatra at Pochampally: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేస్తోన్న 'పీపుల్స్ మార్చ్' పాదయాత్ర 51వ రోజుకు చేరుకుంది. పాదయాత్రలో భాగంగా ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి మండలంలో యాత్ర చేశారు. దారి పొడవునా జనాలు ఆయనకు నీరాజనం పట్టగా.. మరికొందరు వారి సమస్యలను భట్టికి వివరించారు. సమస్యలను విన్న భట్టి విక్రమార్క కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం పోచంపల్లి మండల కేంద్రంలో నేతాజీ సెంటర్ వద్ద తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కారించాలని కోరుతూ.. చేనేత కార్మికులు చేస్తున్న దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు ప్రకటించారు. అనంతరం చేనేత కార్మికుల ఇళ్లకు వెళ్లి వారు నేస్తున్న చీరలను పరిశీలించారు. చేనేత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 8న కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ఆమెకు బహూకరించడానికి పోచంపల్లి సిల్క్ చీరలను భట్టి కొనుగోలు చేశారు.
అనంతరం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మెకు సంఘీభావం తెలిపారు. జేపీఎస్‌ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారిని రెగ్యులరైజ్ చేసి వారికి న్యాయం చేయాలన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు కనీస వేతనం ఇవ్వకపోవడం నేరమని పేర్కొన్నారు. అనంతరం జూలాల్‌పురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజలతో మాట్లాడారు. దీంతో భువనగిరి నియోజక వర్గంలో భట్టి పాదయాత్ర ముగిసింది. అనంతరం మధ్యాహం భోజన విరామం తరువాత రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. చేనేతకు ఉచిత కరెంట్:వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భట్టి విక్రమార్క విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ వెంటనే నేత కార్మికులకు నూలుపైన సబ్సిడీ, చేనేతకు ఉచిత కరెంటు, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. హెల్త్ కార్డులను కూడా జారీ చేస్తామన్నారు. జూనియర్ పంచాయితీ సెక్రటరీలను వెంటనే రెగ్యులర్ చేయాలని, పేస్కేల్‌ను వర్తింపచేయాలని సూచించారు.