తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR TOUR: కాలినడకన వాసాలమర్రిలో వీధివీధిని పరిశీలించిన కేసీఆర్ - telangana varthalu

యాదాద్రి జిల్లా వాసాలమర్రి పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్​ కాలినడకన వీధులు చుట్టివచ్చారు. మూడు దళిత వాడలతో పాటు దత్తత గ్రామంలోని పలు వీధుల్లో పర్యటించారు. అక్కడక్కడ ఆగి కొందరి ఇళ్లల్లోని సభ్యుల సమాచారం అడిగి తెలుసుకున్నారు. తమకు ఇల్లు లేదని పలువురు విన్నవించుకోగా... పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని భరోసా ఇచ్చారు. దళిత బంధు గురించి కేసీఆర్... అక్కడివారితో ప్రస్తావించారు.

CM KCR TOUR: వాసాలమర్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్​ పర్యటన
CM KCR TOUR: వాసాలమర్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్​ పర్యటన

By

Published : Aug 4, 2021, 3:52 PM IST

Updated : Aug 4, 2021, 9:05 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి దళితవాడలోని సుమారు 60 ఇళ్లలోకి వెళ్లిన కేసీఆర్‌... ప్రతి ఒక్కరి యోగక్షేమాలు, కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. మొదట దళిత వాడల్లో పర్యటించిన ముఖ్యమంత్రి ఇళ్లులేని వారందరికీ డబుల్ బెడ్​రూం ఇండ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దళితబంధు పథకం గురించి తెలుసా అని అడిగారు. ఇంటికి పది లక్షలు వస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. కొంత మంది మిల్క్ డైరీ ఫాంలు పెట్టుకుంటామనగా... మరికొందరు ట్రాక్టర్లు కొంటామని, ఇంకొందరు వ్యాపారాలు చేసుకుంటామని సీఎంకు తెలిపారు. దళిత వాడల్లో పర్యటిస్తున్న క్రమంలో ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ ... మీకు పెన్షన్ వస్తుందా.. అని ఆరా తీశారు. పింఛన్​ రానివాళ్లు ఎవరైనా ఉంటే వారికి వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని ఆదేశించారు.

చలించిపోయిన ముఖ్యమంత్రి

దళిత వాడల్లో మట్టి గోడలతో కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లను చూసి ముఖ్యమంత్రి చలించిపోయారు. ప్రతి ఒక్కరికీ ఇండ్లు మంజూరు చేస్తామని దిగులు పడవద్దని సీఎం వారికి భరోసానిచ్చారు. నిరుపేద మహిళలు వృద్ధులు చెప్పిన సమస్యలను ముఖ్యమంత్రి జాగ్రత్తగా విని అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పేదలందరికీ డబుల్ బెడ్​రూం ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నందున కాలనీల రోడ్లు, డ్రైనేజీలు ఒక ప్లాన్ ప్రకారం ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. తమకు పింఛన్​ రావడం లేదని విన్నవించిన సుమారు 20 మంది బీడీ మహిళా కార్మికులకు రెండు రోజుల్లో వెంటనే మంజూరు చేయాలని అధికారులకు ఆదేశించారు.

'గోరేటి' తెలుసా మీకు అంటూ..
ఒక ఇంటిలోపలికి వెళ్లిన సీఎం.. పక్కనేఉన్న ప్రజా కవి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్నను చూపిస్తూ ఈయన మీకు తెలుసా.. దళిత నాయకుడు‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల’అనే పాట రాసింది ఈయనే అని గోరేటి వెంకన్నను వారికి పరిచయం చేశారు. వారికి అందుకున్న పథకాలతో సహా ఏమేం పంటలు సాగు చేస్తున్నారో అని సీఎం అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో సుమారు వంద ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమిని నిరుపేద దళితులకు, ఇతరులకు పట్టాలు చేసి ఇప్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. దత్తత గ్రామమైనందున అన్ని కుటుంబాల వాళ్లకు ఆర్థిక సహాయం అందించి వాళ్ల కుటుంబాలు నిలదొక్కుకునేలా సహాయం అందిస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు.

కాలినడకన ఇంటింటికి..
సుమారు 3 గంటల మేర గ్రామంలో 4 కిలోమీటర్ల వరకు కాలినడకన సీఎం పర్యటించారు. సీఎం వెంట శాసన మండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే గొంగిడి సునితా మహేందర్ రెడ్డి , ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, కలెక్టర్ పమేలా సత్పతి, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సహా ఇతర అధికారులు నేతలు ఉన్నారు. గ్రామ పర్యటన అనంతరం... రైతువేదికలో అన్నదాతలతో సీఎం సమావేశమయ్యారు. గ్రామంలో ఉన్న ఏడు అభివృద్ధి కమిటీలకు సంబంధించిన సుమారు 120 మందితోనూ ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ప్రణాళికలు సిద్ధం చేశారు. సీఎం పర్యటన సందర్భంగా వాసాలమర్రి గ్రామమంతా... పోలీసులు మోహరించారు. ప్రతి ఇంటి వద్ద నలుగురు పోలీసుల లెక్కన భద్రత కొనసాగింది.

CM KCR TOUR: కాలినడకన వాసాలమర్రిలో వీధివీధిని పరిశీలించిన కేసీఆర్

ఇదీ చదవండి:cm kcr: 'వాసాలమర్రిలో 76 ఎస్సీ కుటుంబాలకు రేపట్నుంచి దళితబంధు'

Last Updated : Aug 4, 2021, 9:05 PM IST

ABOUT THE AUTHOR

...view details