Chain snatching in Yadadri Bhuvanagiri district: బంగారు గొలుసు దొంగతనాలు పట్టణాలలోనే కాదు.. గ్రామాలలోను చోటు చేసుకుంటున్నాయి. ఒంటరి మహిళలు, వృద్ధులే లక్ష్యంగా తెంపుడుగాళ్లు విరుచుకుపడుతున్నారు. అదును చూసి గొలుసులు తెంచుకెళ్తున్నారు. వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లే ఒంటరి మహిళలపై దాడి చేసి బంగారు గొలుసులను అపహరిస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ గ్రామంలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. గ్రామానికి చెందిన చాగంటి మంగమ్మ అనే మహిళ ఉదయం 10 గంటల సమయంలో పొలం పనులు చేసుకుంటుంది. అటుగా వచ్చిన ఓ గుర్తు తెలియని దుండగుడు ఆమె మెడలోంచి మూడు తులాల పుస్తెలతాడు లాక్కొని పరారయ్యాడు. దుండగుడు లక్ష్మాపురం గ్రామం వైపు వెళ్లినట్లు బాధితురాలు తెలిపింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. గ్రామంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా అనుమానితుడుగా భావిస్తున్న ఓ వ్యక్తి బైక్ పై వెళ్తున్న దృశ్యాలు నమొదైయ్యాయి. వలిగొండ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మద్యానికి, జల్సాలకు అలవాటు పడిన కొందరు యువత.. వారి ఖర్చులకు డబ్బు కోసం ఇటువంటి దారులను ఎంచుకుంటున్నారు. ఆ క్షణానికి చేతిలో డబ్బులు లేకపోతే.. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని బంగారు గొలుసులను అపహరిస్తూ ఎదుటివారి ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు.