దేశంలో పర్యాటక శాఖను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జనవరి నుంచి పర్యాటక రంగాన్ని పునఃప్రారంభించాలని అనుకుంటున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో కిషన్ రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర మూడోరోజు సాగుతోంది. తెల్లవారుజామునే యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న కిషన్ రెడ్డి.... ఆలయ పునర్నిర్మాణాన్ని పరిశీలించారు. తెలుగు ప్రజల ఆశీస్సులతోనే కేంద్రమంత్రిని అయ్యానని తెలిపారు.
"గతంలో పార్టీ అధ్యక్షుడిగా 3సార్లు పని చేశాను. అంబర్‌పేట ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా 3సార్లు గెలిచాను. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా రెండేళ్లు చేశాను. అది నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. నా పని తీరును గుర్తించి కేబినెట్ మంత్రిగా మోదీ పదోన్నతి కల్పించారు. ప్రధాని మోదీ నాపై నమ్మకం ఉంచి ప్రభుత్వంలో కీలకమైన సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్యా రాష్ట్రాల అభివృద్ధి బాధ్యతను అప్పగించారు. 370 ఆర్టికల్ రద్దులో భాగస్వామిని అయ్యాను.
దేశంలో పర్యాటక శాఖను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జనవరి నుంచి పర్యాటక రంగాన్ని పునః ప్రారంభించాలని అనుకుంటున్నాం. ఆధ్యాత్మిక కేంద్రాలు, జలపాతాలు, అతి పురాతన కట్టడాలు దేశంలో ఉన్నాయి. వాటిని పరిరక్షించేందకు చర్యలు చేపడుతున్నాము. బతుకమ్మ, బోనాలు, వినాయక చవితి, మేడారం జాతరలను చిత్రీకరించి దేశ వ్యాప్తంగా చూపించబోతున్నాము. తెలంగాణతో పాటు ప్రతి రాష్ట్రంలోని పండుగలను గుర్తిస్తాం.''