తెలంగాణ

telangana

ETV Bharat / state

హోరాహోరీగా పార్టీల ప్రచారం.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నేతలు - మునుగోడు తాజా వార్తలు

Munugode Election campaign of all parties: మ్యానిఫెస్టో ప్రకటనలు, ఆత్మీయ సమ్మేళనాలు, ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులతో మునుగోడు ఉపఎన్నిక హోరెత్తుతోంది. ప్రచారాలకు మరో వారం మాత్రమే గడువు ఉండటంతో.. మిగిలిపోయిన ప్రాంతాలను చుట్టివచ్చేలా రాజకీయ పార్టీలు ప్రచార వేగం పెంచాయి. ఈ నెలాఖరుకు అగ్రనేతల బహిరంగ సభలకు ఏర్పాట్లు చేస్తుండగా ఆ లోగా క్షేత్రస్థాయి పర్యటనలు ముగించేలా గ్రామాలను చుట్టేస్తున్నారు. నమ్ముకున్న ఓటుబ్యాంకు చివరి సమయంలో చేజారకుండా రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు ఊరూరా మోహరించారు.

Munugode Election campaign of all parties
Munugode Election campaign of all parties

By

Published : Oct 26, 2022, 7:53 PM IST

హోరాహోరీగా పార్టీల ప్రచారం.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నేతలు

Munugode Election campaign of all parties: ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నాయి. మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామంలోని కాశవారిగూడెంలో నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిధిలోని తంగడపల్లిలో ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ ఇంటింటి ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే పలువురు పద్మశాలీల ఇళ్లకు వెళ్లిన మంత్రి.. వారితో ప్రధాని మోదీకి పోస్టుకార్డులు రాయించారు.

ఎన్నో కష్టాలెదుర్కొంటున్న చేనేత కార్మికులపై జీఎస్టీ పేరుతో మోయలేని భారం మోపుతున్నారని శ్రీనివాస్‌ గౌడ్ అన్నారు. చండూరులో తెరాస అభ్యర్థికి మద్దతుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకట్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. భాజపా కుట్రతో తీసుకువచ్చిన ఈ ఉపఎన్నికలో ఆ పార్టీకి ప్రజలు బుద్ధిచెప్పాలని కూనంనేని కోరారు. చండూరులో ప్రచారం నిర్వహించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌.. సానుభూతి కోసం రాజగోపాల్‌రెడ్డి అనారోగ్య డ్రామాలాడుతున్నారని ఆరోపించారు.

గుజరాత్‌ తరహాలో పరిస్థితులు: నాంపల్లి మండలం స్వాములవారి లింగోటంలో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి జగదీశ్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. భాజపాను ఆదరిస్తే గుజరాత్‌ తరహాలో రైతులను ఆగం చేసే పరిస్థితులు వస్తాయని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. నాంపల్లి మండలం తుంగపాడు గౌరారంలో ప్రచారానికి వెళ్లిన తెరాస అభ్యర్థి కూసుకుంట్లను పలువురు అడ్డుకోవటంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. గత ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ ఆందోళనకు దిగారు. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.

నియోజకవర్గ అభివృద్ధి కోసమే తన భర్త రాజీనామా: మునుగోడు మండలం కిష్టాపురంలో భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించారు. రాజగోపాల్​రెడ్డి గెలుపు కోసం విస్తృత ప్రచారం సాగిస్తున్న ఆయన సతీమణి లక్ష్మి.. మునుగోడు మండలం కల్వలపల్లిలో పర్యటించారు. ఈ సమయంలోనే హైదరాబాద్‌లో తెరాస ఏర్పాటు చేసిన ముదిరాజ్‌ ఆత్మీయ సమ్మేళానికి వెళ్తున్న బస్సెక్కిన ఆమె రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తన భర్త రాజీనామా చేశారని చెప్పారు.

గిరిజనుల రిజర్వేషన్లు పెంచారు: నాంపల్లి మండలం రాందాస్ తండాలో భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ప్రచారం నిర్వహించారు. మునుగోడు ఉపఎన్నిక వచ్చినందునే సీఎం కేసీఆర్.. తొమ్మిదేళ్లుగా పెండింగ్​లో ఉన్న గిరిజనుల రిజర్వేషన్లు పెంచారని అన్నారు. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతానన్న ముఖ్యమంత్రి వారి భూములు లాక్కున్నారని ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మర్రిగూడ మండలంలో ప్రచారం నిర్వహించారు. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో పర్యటించిన కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. తెరాస, భాజపా డబ్బును నమ్ముకున్నాయని ఆరోపించారు. రెండు పార్టీల కుట్రలను చిత్తుచేసి కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు.

ఇవీ చదవండి:మునుగోడు BJP మెనిఫెస్టో రిలీజ్... TRSకు బిగ్ సవాల్!

ఆ భూములపై కేసీఆర్ కన్ను.. సినిమా పెద్దలకు అప్పగించేందుకు కుట్ర: రేవంత్

ఆ సీఎంలు ఇస్తున్న డబ్బులతోనే PK రాజకీయం.. సంచలన విషయాలు వెల్లడి

ABOUT THE AUTHOR

...view details