యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా పలు ఇత్తడి నిర్మాణాలు యాడ చేపడుతోంది. ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న సప్తరాజ గోపురాలకు ఇత్తడితో తయారుచేసే కిటికీలు అమర్చుతున్నారు. గాలిగోపురాల్లోకి కోతులు, పక్షులు, వెళ్లకుండా ఇత్తడి కిటికీలు, అద్దాలు బిగిస్తున్నారు. క్యూలైన్ టెండర్‌లో భాగంగా కిటికీలను శ్రీకాళహస్తి నుంచి వచ్చిన కళాకారులు స్థానికంగా తయారు చేశారు. తొలుత ఐదంతస్తుల తూర్పు రాజ గోపురానికి కిటికీలు బిగించారు.
తుది దశకు
ఆలయ మాడవీధుల్లో ఇత్తడి గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు తుదిదశకు చేరుకున్నాయి. శిల్పకళా మండప ప్రాకారాలను భక్తులు తిలకించేందుకు వీలుగా నలువైపులా వీటిని బిగించారు. బయటి ప్రాకారాలతో పాటు లోపలి వైపు ఉన్న మండపాల చుట్టూ వీటిని అమరుస్తారు. మ్యాన్ హోల్స్ పైన ఇత్తడి పలకలు వేయనున్నారు. ఆలయ సన్నిధిలో ఇత్తడి క్యూలైన్లు సిద్ధం చేసేందుకు తిరుపతికి చెందిన నిపుణులతో యాడ అధికారులు చర్చిస్తున్నారు. క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయంలోకి ప్రవేశించే భక్తుల కోసం ఇత్తడి షెడ్లు నిర్మాణానికి గతంలోనే రూపకల్పన చేశారు. ఇత్తడి దర్శన వరుసలను ఉత్సవాల అప్పుడు పక్కకు జరుపుకునేలా తీర్చిదిద్దుతున్నట్లు ఆలయ శిల్పి ఆనంద్ సాయి తెలిపారు.