యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపురం ప్రాజెక్టు వద్ద పనులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ.... ముంపు గ్రామం బీఎన్ తిమ్మాపూర్ వాసులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పరిహారం చెల్లించడంతో పాటు పునరావాసం కల్పించాలంటూ ఆందోళనకు దిగారు. 17వందల 40ఎకరాలకు గానూ..... ఇప్పటివరకు కేవలం 240 ఎకరాలకే పరిహారమిచ్చారని... మిగిలిన నిర్వాసితులకు త్వరితగతిన చెల్లించాలని డిమాండ్ చేశారు. పట్టా భూములతో పాటు, సీలింగ్, కబ్జా భూములకు కూడా సమాన పరిహారమివ్వాలని బాధితులు కోరారు.గ్రామంలోని యువకులకు యాదాద్రి దేవస్థానంలో ఉద్యోగావకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నష్టపరిహరం చెల్లించేంత వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
బస్వాపురం ప్రాజెక్టు వద్ద బీఎన్ తిమ్మాపూర్ గ్రామస్థుల రిలే దీక్ష - బస్వాపురం ప్రాజెక్టు తాజా వార్తలు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బస్వాపురం ప్రాజెక్టులో ముంపు గ్రామం బీఎన్ తిమ్మాపూర్ వాసులు ప్రాజెక్టు నిర్మాణం వద్ద ఆందోళన బాటపట్టారు. పునరావాసం ఎక్కడ కల్పిస్తారో నిర్ణయించలేదని, దీంతో ముంపునకు గురవుతున్న బీఎన్ తిమ్మాపూర్ బాధితులు ప్రాజెక్ట్ నిర్మాణ పనులు నిలిపివేయాలని, తమకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని బస్వాపురం ప్రాజెక్టు వద్ద రిలే నిరాహారదీక్ష మొదలు పెట్టారు.
![బస్వాపురం ప్రాజెక్టు వద్ద బీఎన్ తిమ్మాపూర్ గ్రామస్థుల రిలే దీక్ష బస్వాపురం ప్రాజెక్టు వద్ద బీఎన్ తిమ్మాపూర్ గ్రామస్థుల రిలే దీక్ష](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10460232-651-10460232-1612177634982.jpg)
పునరావాస గ్రామం ఏర్పాటు చేయాలని, అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 16వ ప్యాకేజీలో భువనగిరి మండలం బస్వాపూర్‌లో 11.39 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో జలాశయాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. జలాశయం నిర్మాణంలో మండలంలోని బీఎన్ తిమ్మాపూర్ గ్రామం పూర్తిగా ముంపునకు గురవుతోంది. రెండేళ్లుగా పనులు జరుగుతున్నా పరిహారం, పునరావాసం సంగతి తేల్చకపోవడం వల్ల గ్రామస్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శి స్మితా సబర్వాల్ పర్యటించి జులై లోపు ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన నేపథ్యంలో నిర్మాణం పూర్తైతే తమను ఎవరూ పట్టించుకోరని భావించిన గ్రామస్థులు ఏకమై తేడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. సోమవారం బస్వాపురం జలాశయం నిర్మాణపనులు నిలిపివేయాలని తమకు నష్టపరిహారం, పునరావాసం చూపే వరకు నిర్మాణ పనులు చేయకుండా ఉండాలని రిలే నిరాహారదీక్ష ప్రారంభించారు.