Bandi Sanjay on CM KCR: రాష్ట్రంలో రాక్షసపాలన జరుగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సభలో విమర్శించారు. బుక్కెడు బువ్వ కోసం బాసర ట్రిపుల్ ఐటీతో పాటు రాష్ట్రంలోని పలు గురుకులాల విద్యార్థులు అలమటిస్తున్నారన్నారు. కేసీఆర్ కుటుంబానికి నిజాయితీ ఉంటే అక్కడికి వెళ్లి భోజనం చేయాలని డిమాండ్ చేశారు. ప్రణాళిక లేకుండా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏ ముఖం పెట్టుకొని జాతీయహోదా ఇవ్వాలంటున్నారని మండిపడ్డారు. చీకోటి ప్రవీణ్ క్యాసినో ఉదంతంలోనూ తెరవెనుక ఉన్నది తెరాస నేతలే అని ఆరోపించారు.
‘భాజపా ఎక్కడుందన్న వాళ్లకు పాలమూరులో చూపించాం. ఇప్పుడు నల్గొండలో.. తర్వాత ఖమ్మంలోనూ చూపిస్తాం. దేశంలో షెడ్యూల్ లేని సీఎం కేసీఆర్ మాత్రమే. దిల్లీకి ఎందుకు పోయారో ఆయనకే తెలియదు. ఇక్కడ ఏమీ చేయని కేసీఆర్ దిల్లీలో రాజకీయ సమీకరణాలను మారుస్తానంటున్నారు. నయీం ఎన్‌కౌంటర్ అనంతరం స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, రూ. వేల కోట్లు ఎక్కడున్నాయో కేసీఆర్ చెప్పాలి. లేదంటే భాజపా ప్రభుత్వం వచ్చాక లెక్కలు తేలుస్తాం. కేసీఆర్ చేతగాని పాలన వల్ల ఏడాదిలో సుమారు 2 వేల మంది చేనేత కార్మికులు మరణించారు. మరణించిన నేత కార్మికులకూ బీమా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. యాదాద్రి ఆలయ నిర్మాణంలో కేసీఆర్ నాణ్యత లేని పనులు చేయించారు’ అని బండి సంజయ్ విమర్శించారు.
కమీషన్ల కోసమే సీఎం కేసీఆర్ కాళేశ్వరం: కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్
కమీషన్ల కోసమే సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబానికి పాలిచ్చే గేదెలాగా.. ఈ ప్రాజెక్టు డబ్బు సంపాదించే మిషన్ అయిందని విమర్శించారు. ఇంజినీరింగ్, డిజైన్ లోపం కారణంగానే ఇటీవలి వరదల్లో కాళేశ్వరం పంపుహౌస్‌లు మునిగాయన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర యాదాద్రిలో మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా యాదాద్రి శివారు యాదగిరిపల్లిలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో భాజపాను అధికారంలోకి తెచ్చి గోల్కొండపై కాషాయ జెండా ఎగరేస్తాం. ఎవరు సీఎం అయినా తొలుత భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే ప్రమాణ స్వీకారం చేస్తారు.
- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
‘‘కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేసీఆర్ అడుగుతుంటే మోదీ ఎందుకివ్వడం లేదని మీడియా వాళ్లు నన్ను అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మూడు ఆనకట్టలు, పంప్‌హౌస్‌లు నీటిలో మునిగిపోయాయి. ఈ ప్రాజెక్టును తప్పుడు డిజైన్‌తో నిర్మించారు. ఇంజినీరింగ్ లోపముంది. సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లే ప్రాజెక్టు ముంపునకు గురైంది. పైగా దీనికి ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ లేదు. పర్యావరణ అనుమతులు లేవు. ఇన్ని లోపాలున్న ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎలా సాధ్యం? కేసీఆర్ అక్రమాల ప్రాజెక్టుకు మోదీని బాధ్యుడిని చేయడానికి జాతీయ హోదా ఇవ్వాలని అడుగుతున్నారు. అది ఇస్తే కేంద్రం బదనాం అయ్యేది. జరిగిన తప్పులకు కేసీఆర్ బాధ్యత వహించాల్సిందే’’ అని షెకావత్ అన్నారు. అవినీతిపరులను జైళ్లో వేసేందుకు భాజపాకు ఈ దఫా అధికారం ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతిస్థాయిలో అవినీతి జరుగుతోందన్నారు. రాష్ట్ర సాధన కోసం బలిదానాలు చేసిన వారికి సరైన నివాళి ఇవ్వాలి అంటే తెరాస ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిందేనన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన అభ్యర్థికి కాకుండా అవినీతి, కుటుంబ పార్టీలకు మద్దతిచ్చారన్నారు. తెలంగాణ ఏర్పాటుకు లోక్‌సభలో అప్పటి ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ అండగా నిలిచారని గుర్తు చేశారు. ఇక్కడి ప్రజలు ఆమెను చిన్నమ్మగా గుర్తుపెట్టుకున్నారన్నారు. ఎంతో పవిత్రస్థలమైన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్న ఆయన తెలుగులో తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు.
యాదాద్రిలో నాసిరకం పనులు: డీకే అరుణ
‘రూ.వందల కోట్లతో నిర్మించిన యాదాద్రి ఆలయ నిర్మాణ పనులన్నీ నాసిరకంగా జరిగాయి. ఇందులో అన్ని అవకతవకలే చోటు చేసుకున్నాయి. కాసులకు, కమీషన్లకు కక్కుర్తి పడి నాసిరకం పనులు చేశారు. రాష్ట్రంలో వచ్చేది భాజపా ప్రభుత్వమే’ నని పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే ఆరుణ అన్నారు.
అద్దాల మేడలో కేసీఆర్: ఈటల