Bandi Sanjay Visit Yadadri Temple: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి మా ఇంటి ఇలవేల్పు అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని ఇవాళ దర్శించుకున్నారు. ఆయనతో పాటుగా పార్టీ రాష్ట్ర మహిళ ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, పి.వి.శ్యామసుందర్ రావు వెంట ఉన్నారు. వీరికి ఆలయ సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక స్వాగతం పలికారు.
ప్రధాన ఆలయంలో స్వయంభూ మూర్తులను, ముఖ మండపంలో అష్టోత్తర మూర్తులను బండి సంజయ్ దర్శించుకున్నారు. ఆలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు ఆలయాధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, గూడూరు నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్, సుగుణాకర్, నరేందర్, రచ్చ శ్రీనివాస్, రాష్ట్ర విభాగం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
నిరసన: ఎంపీ బండి సంజయ్ కాన్వాయ్‌లోని వాహనాలను కొన్నింటికి మాత్రమే కొండపైకి అనుమతి ఉందని పోలీసులు తెలుపగా... భాజపా కార్యకర్తలు నిరసన తెలిపారు. ప్రొటోకాల్ ప్రకారమే ఎంపీ వెంట వచ్చిన కొన్ని వాహనాలను మాత్రమే ఆలయ అధికారులు కొండపైకి అనుమతించారు. కొండ పైకి వెళ్లని కార్యకర్తలు ఘాట్ రోడ్డు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.