హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న కుటుంబాలకు వరద సహాయం ఇప్పటికీ అందలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ముంపు బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
వరద బాధితులకు ఇంటి వద్దకే పరిహారం వస్తుందని.. మంత్రి కేటీఆర్ చెప్పారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అయితే మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికే డబ్బులు వస్తుండడం వల్ల మీ సేవ కేంద్రాల వద్ద వందలాది మంది క్యూ కడుతున్నారని పేర్కొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు క్యూలో నిలబడినా.. దరఖాస్తులు తీసుకోవడం లేదని, వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లల తల్లులు నిలబడలేక ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.