bhatti People's March Padayatra: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఆలేరుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆలేరు రైల్వే గేట్ వద్ద జరిగిన కార్నర్ మీటింగ్లో భట్టి విక్రమార్క ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని భావించి కొట్లాడిన తెలంగాణ ప్రజలకు.. సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని భట్టి పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి దశాబ్ద కాలం అవుతున్నా బీఆర్ఎస్ పరిపాలనలో నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యాలు నెరవేరకపోవడంతో పాటు ఆత్మగౌరవం కూడా దక్కకపోవడంతోనే తెలంగాణ ప్రజల బాగు కోసం పాదయాత్ర మొదలుపెట్టానని చెప్పారు.
ప్రజల అవసరాలా.. పాలకుల రాజ భవనమా: 'ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ భార్య పిల్లలతో రాత్రుళ్లు రోడ్లపైన టార్పాలిన్ పట్టాలు కప్పుకొని బిక్కుబిక్కుమంటూ ధాన్యం ఎప్పుడు కొంటారని ఎదురుచూస్తూ కాలరాత్రులు గడపడం కోసమేనా తెలంగాణ తెచ్చుకున్నదని భట్టి వివర్శించారు. ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టిన పాదయాత్ర.. ఆలేరు చేరుకునేంత వరకు ఏ గ్రామంలో చూసినా ప్రజలు ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. కొలువులు లేక గడ్డాలు పెంచుకొని విద్యార్థులు, నిరుద్యోగులు రోడ్ల మీద పిచ్చోళ్ల మాదిరిగా తిరుగుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారన్నారు. అనేక గ్రామాల్లో పేద ప్రజలు తిండి లేక అల్లాడిపోతున్నారని.. ప్రజల అవసరాలు తీర్చాల్సిన ఈ ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున సెక్రెటేరియెట్ కట్టాం.. తెలంగాణ వెలిగిపోతుందని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజల అవసరాలు తీర్చడం ముఖ్యమా? పాలకులు కూర్చునేందుకు రాజ భవనం కట్టుకోవడం అవసరమా? ఆలోచన చేయండి అన్నారు.'
బీఆర్ఎస్ పరిపాలన వద్దు.. ఇందిరమ్మ రాజ్యం కావాలి:బీఆర్ఎస్ పరిపాలన వద్దని.. ఇందిరమ్మ రాజ్యం కావాలని పాదయాత్ర చేసిన ప్రతి గ్రామంలో ప్రజలు నాతో చెప్పారని భట్టి పేర్కొన్నారు. సోనియా గాంధీ నేతృత్వంలో తీసుకువచ్చిన ఫారెస్ట్ రైట్ యాక్ట్ ద్వారా ఆదివాసీ గిరిజనులకు పంచిన భూములను ధరణి తీసుకువచ్చి ఆదివాసులకు, గిరిజనులకు ఆ భూమిపై హక్కు లేకుండా చేసిన ఈ ప్రభుత్వాన్ని వదిలించుకొని వచ్చే ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకునేందుకు ఆదిలాబాద్ అడవి బిడ్డలు సమాయత్తం అవుతున్నారని చెప్పుకొచ్చారు. సింగరేణి ప్రైవేటీకరణతో ఉద్యోగాలు కొల్లగొడుతున్న దుర్మార్గ ప్రభుత్వాన్ని దింపుతామని పిడికిలి బింగించి సింగరేణి కార్మికులు నాతో చెప్పిన మాటలు మీతో పంచుకుంటున్నానని అన్నారు. కొలువుల కోసం కొట్లాడిన రాష్ట్రంలో.. లేకలేక ఒక నోటిఫికేషన్ వేసి ప్రశ్నాపత్రాలు లీక్ చేసి తమ జీవితాలతో చెలగాటమాడిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుతామని కాకతీయ యూనివర్సిటీ సందర్శించిన సందర్భంగా విద్యార్థులు ఆక్రోశాన్ని వెళ్లగక్కారని భట్టి చెప్పుకొచ్చారు.