తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్​ కిట్​... అమ్మకు అందని ఆసరా - కేసీఆర్​ కిట్

అమ్మకు ఆసరాగా, బిడ్డకు ఆప్యాయతతో ప్రోత్సాహకాలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకం కేసీఆర్​ కిట్. సర్కార్​ దవాఖానాల్లో ప్రసవాలు ప్రోత్సహించి తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండటానికి చేయూతనిచ్చేందుకు కేసీఆర్​ కిట్​తో పాటు నగదు పారితోషికం అందజేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ప్రస్తుతం కేవలం కేసీఆర్​ కిట్​తోనే సరిపెడుతున్నారు, ప్రసవసమయంలో ఆసరాగా నిలుస్తుందనుకున్న నగదు అందని ద్రాక్షలా మారింది.

కేసీఆర్​ కిట్​... అమ్మకు అందని ఆసరా

By

Published : Aug 19, 2019, 8:09 PM IST

కేసీఆర్​ కిట్​... అమ్మకు అందని ఆసరా

ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పులను ప్రోత్సహించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం కేసీఆర్​ కిట్​. గర్భిణీలు, బాలింతలకు చేయూతనివ్వడానికి మూడేళ్ల క్రితం ప్రారంభించిన ఈ పథకంలో కిట్​తో పాటు మగబిడ్డకు జన్మనిస్తే రూ.12వేలు, అమ్మాయి పుడితే రూ.13 వేల చొప్పున నగదు ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.

గర్భిణీలు సర్కార్​ దవాఖానాలో పేరు నమోదు చేసుకున్న సమయంలోనే బ్యాంక్​ ఖాతా, ఆధార్​ కార్డుకు సంబంధించిన పత్రాలు అందజేయాలి. ఐదో నెలలోపు మొదటి విడతగా రూ.3 వేలు, ప్రసవం అయ్యాక అబ్బాయి పుడితే రూ.4 వేలు, అమ్మాయికి జన్మనిస్తే రూ.5 వేలు జమ చేస్తారు. పిల్లలకు మూడున్నర నెలల వయస్సులో ఇంజక్షన్​ ఇచ్చే సమయంలో రూ.2వేలు, తొమ్మిది నెలల సమయంలో రూ. 3వేలు ఇస్తారు.

ఏడాది నుంచి రావడం లేదు

గతేడాది అక్టోబర్​ నుంచి చెల్లింపులు నిలిచిపోయాయి. నగదు కోసం లబ్ధిదారులు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకు ఆలస్యం అవుతోందో అధికారులు సరైన సమాధానం చెప్పడం లేదుంటూ వాపోతున్నారు. ప్రసవానికి వచ్చిన వారికి వైద్యులు కేవలం కేసీఆర్​ కిట్లు ఇచ్చి పంపిస్తున్నారు. పారితోషికం మాత్రం జమ చేయడం లేదు.

డబ్బులు రాలేదు

యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ డివిజన్ పరిధిలో దాదాపు 10 వేల మంది కేసీఆర్ కిట్ పథకం ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. చౌటుప్పల్ సామాజిక ఆసుపత్రి, రామన్నపేట ప్రాంతీయ ఆసుపత్రితో పాటు 7 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 48 ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2018-19 సంవత్సరంలో 4,232 మంది గర్భిణీలు పథకం కింద పేరు నమోదు చేసుకున్నారు. 2019 జూన్ వరకు 964 మంది నమోదు చేసుకోగా ..ఎవరికి డబ్బులు జమ కాలేదు. కేవలం కేసీఆర్ కిట్ ఇచ్చి పంపిస్తున్నారుని ఆశావర్కర్లు చెబుతున్నారు.

మేం అడుగుతున్నాం

వైద్య, ఆరోగ్య శాఖ నుంచి పెండింగ్‌లో ఉన్న కేసీఆర్‌ కిట్‌కు సంబంధించి డబ్బులు రాగానే అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ విషయమై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేస్తూనే ఉన్నామని అంటున్నారు.

పాపకు ఓకే... తల్లికి?

పుట్టిన బేబీకి కేసీఆర్ కిట్లు ముట్టజెప్పిన ప్రభుత్వం.. తల్లులకు ఇచ్చే పైసలను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. గత ఏడాదంతా పక్కాగా అమలైన ఈ ​పథకం.. ఎన్నికల సీజన్ మొదలయ్యాక అవస్థలు పడుతోంది. నాలుగు విడతల్లో పైసలు ఇవ్వాల్సి ఉన్నా.. ప్రతి విడతలోనూ పెండింగ్‌లే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి వెంటనే తమకు ఇవ్వాల్సిన నగదును ఖాతాల్లో జమచేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details