యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన బండి సంజయ్కు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రైతు సంక్షేమంపై కిసాన్ మోర్చా నాయకులు, కార్యకర్తలకు సంజయ్ దిశానిర్దేశం చేశారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఎరువులు, ముడి సరుకుల ధరలు పెరిగినా.. మోదీ ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై ఎరువులను అందిస్తోందని బండి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టి.. రైతులకు అండగా నిలిచింది భారతీయ కిసాన్ మోర్చా అని ఆయన కొనియాడారు. లాక్డౌన్ సమయంలోనూ కిసాన్ మోర్చా నిరుపేద రైతులకు అండగా నిలిచిందని గుర్తు చేశారు.
కేసీఆర్ పెట్టే అక్రమ కేసులకు భయపడేదే లేదు..
మోదీ ప్రభుత్వం అమలు చేసిన కరోనా కట్టడి వ్యూహాలను ప్రపంచ దేశాలు అనుసరించాయని బండి సంజయ్ పేర్కొన్నారు. కొవిడ్ విపత్తు సమయంలో ప్రజలు, అన్నదాతలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా మోదీ చర్యలు తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో భాజపా నాయకులు, కార్యకర్తలపై తెరాస అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ పెట్టే అక్రమ కేసులకు భయపడేదే లేదన్నారు. రైతుల సంక్షేమమే పార్టీ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.