దేదీప్యమానంగా యాదాద్రి పుణ్యక్షేత్రం యాదాద్రి(YADADRI) క్షేత్రాభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు లోపించకుండా, వాస్తుకు అనుగుణంగా చేపట్టాలని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి సూచించారు. ఆలయ సందర్శనలో భాగంగా... ప్రధానాలయంలో పసిడి వర్ణపు విద్యుద్దీపాల అలంకరణ, భక్తప్రహ్లాద ప్యానల్‌కు అమర్చిన దీపాలను ఆయన పరిశీలించారు. ఇత్తడి దర్శన వరుసలను చూసి సంప్రదాయ హంగులతో మరింత మెరుగుపర్చాలని సూచించారు. శివాలయం సాలహారాల్లో బిగించాల్సిన విగ్రహాల గురించి అధికారులతో చర్చించారు. అనంతరం, పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. బాలాలయంలో లక్ష్మినరసింహస్వామిని ఆయన దర్శించుకున్నారు. ఐదు రాజగోపురాల ద్వారాలను పసిడి వర్ణంలో తీర్చిదిద్దే క్రమంలో భాగంగా.... పద్మం ఆకృతిలోని ఇత్తడి తొడుగులను బిగిస్తున్నారు.
యాదాద్రి కొండకు పచ్చని శోభ
గుట్ట చుట్టూ పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు. ఇందుకోసం యాడా ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. కొండ చుట్టూ ఖాళీ ప్రదేశాలు, రహదారి మార్గాల్లో వివిధ రకాల మొక్కలు నాటారు. అవి పెరగడంతో యాదాద్రిహరిత శోభను సంతరించుకుంది. దర్శనానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదం కలిగించేలా దర్శనానంతరం సేద తీరేందుకు వీలుగా పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు. కొండ చుట్టూ చేపట్టిన వలయ రహదారి వెంట వివిధ రకాల రంగురంగుల పూల మొక్కలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
ఇత్తడి తొడుగులు
యాదాద్రిఆలయ తూర్పు రాజగోపురం ద్వారానికి ఇత్తడి తొడుగుల బిగింపునకు సన్నాహాలు చేపట్టారు. ఇప్పటికే ఆలయ ప్రవేశ ద్వారాలు ఉత్తర, దక్షిణ దిశల్లో గల ద్వారాలకు ఇత్తడి కవచాలు బిగించిన విషయం తెలిసిందే. ఆలయానికి నలువైపులా గల ఐదు రాజగోపురాల ద్వారాలకూ 2600 కిలోల ఇత్తడి అవసరమని తయారీదారులు చెబుతున్నారు. గోపురాల ద్వారాలకు పద్మం ఆకృతీకరణ జరుగుతోంది. త్రితల రాజగోపురం, ప్రధాన ఆలయంలోని ఉప ఆలయాలకు వెండి కవచాల ద్వారాలు బిగించనున్నట్లు యాడా అధికారులు చెబుతున్నారు. హనుమ, గరుడమూర్తులకు ప్రధాన ఆలయంలోకి వెళ్లే మార్గంలోని కృష్ణశిలతో రూపొందించిన ఆంజనేయ స్వామి, గరుడ ఆళ్వారులను వెండి కవచాలతో భక్తులను అలరించేలా రూపకల్పనకు యాడా యోచిస్తోంది.
జలపాతాలు ప్రత్యేక ఆకర్షణ
యాదాద్రిలో జలపాతాలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. యాదాద్రి క్షేత్రాన్ని సకల హంగులతో ముస్తాబు చేస్తున్నారు. ఘాట్ రోడ్డువెంట ఉన్న రాతి గుట్టలపై జలపాతాన్ని ఏర్పాటు చేశారు. జలపాతాల నుంచి నీరు జాలువారుతూ భక్తులకు ఆహ్లాదాన్ని కలిగించేలా ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు వైటీడీఏ అధికారులు తెలిపారు. పదిరోజుల క్రితం ట్రయల్ రన్ నిర్వహించగా... శుక్రవారం మరోసారి ట్రయల్ రన్ చేపట్టారు. యాదాద్రి పర్యటనలో భాగంగా సీఎంవో భూపాల్ రెడ్డి ఈ వాటర్ ఫాల్ ట్రయల్ రన్ కార్యక్రమం పరిశీలించారు. ఈ క్రమంలో భక్తులు జలపాతాల వద్ద సెల్ఫీలు దిగుతూ మురిసిపోయారు.
ఇవీ చదవండి: