భువనగిరి రాక్ క్లైంబింగ్ శిక్షణా కేంద్రంలో పర్వతారోహణలో ఓనమాలు నేర్చుకుని ప్రస్తుతం శిక్షకురాలిగా పనిచేస్తోంది అన్వితా రెడ్డి. ఎంతో మంది ఔత్సహిక యువతీ, యువకులకు మెళకువలు నేర్పిస్తూనే... అడ్వాన్స్‌డ్ కోర్సులను పూర్తి చేసింది. భువనగిరి రాక్ క్లైంబింగ్ స్కూల్‌లో మొదటి మహిళా శిక్షకురాలిగానే కాకుండా రాష్ట్రంలోనే పర్వతారోహణలో మొదటి ప్రొఫెషనల్ మహిళ శిక్షకురాలిగా గుర్తింపు పొందింది. గతనెల 21న ఆఫ్రికాలోనే ఎత్తైన శిఖరం కిలిమాంజారో అధిరోహణకు వెళ్లింది. స్పాన్సర్స్ ముందుకు వచ్చి సహాయం చేస్తే మరిన్ని సాహసాలు చేస్తానని అన్వితా రెడ్డి వెల్లడిస్తోంది.
చిన్నప్పటి నుంచి
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం యర్రంబల్లికి చెందిన అన్వితారెడ్డికి చిన్నప్పటి నుంచి సాహస క్రీడలంటే మక్కువ. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మరింత ఆసక్తి పెరిగింది. పర్వతారోహణ చేయాలంటే ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఎముకలు కొరికే చలి, సామగ్రి, ఆహారపదార్థాలు మోసుకెళ్లటం లాంటి సవాళ్లను తట్టుకోవాలి. స్పాన్సర్లు దొరికితే 7 ఖండాల్లో 7 ఎతైన శిఖరాలు అధిరోహించాలనే తమ కుమార్తె కళ నెరవేరుతుందని అన్వితారెడ్డి తల్లి చెబుతోంది.