Yadadri Brahmotsavam: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ఎదుర్కోలు స్వామి అమ్మ వార్లను ప్రత్యేక అలంకారంలో ఆలయ మాడవీధుల్లో ఊరేగించి తూర్పు రాజ గోపురం ముందు ఎదురెదురుగా అధిష్టింపజేసి ఎదుర్కోలు తంతును వైభవంగా నిర్వహించారు.
అర్చకులు.. స్వామివారి తరపున ఆలయ ఈవో.. గీతారెడ్డి, అర్చకులు అమ్మవారి తరఫున ఆలయ ఛైర్మన్ నర్సింహమూర్తి, మరి కొంత మంది అర్చకులు పెళ్లిపెద్దలుగా ఉండి ఎదుర్కోలు తంతును నిర్వహించారు. మహోత్సవంలో భాగంగా ఇరువర్గాల మధ్య వాదసంవాదాల మధ్య ఎదుర్కోలు కార్యక్రమం కనుల పండువగా జరిగింది. ఒప్పందాలు, చర్చల అనంతరం స్వామివారు మాకు నచ్చారని అమ్మవారి తరపున, అమ్మవారు మాకు కూడా నచ్చారని స్వామి తరపున పెద్దలు అంగీకరించడంతో ఎదుర్కోలు కార్యక్రమం ముగిసింది.
Sri Lakshminarasimha swami kalyanam: అనంతరం వేదపండితులు స్వామిఅమ్మవార్ల కల్యాణం కోసం తులాలగ్నం మంచి ముహూర్తాన్ని నిర్ణయించారు. ఆలయ మాడవీధిలో నృసింహ వైభవ తిరుకల్యాణోత్సవం మంగళవారం రాత్రి 8గంటలకు సుముహూర్తం నిర్ణయించారు. ఇరు వర్గాలవారు దీనికి ఒప్పకొని నిశ్చయ తాంబూలాలు మార్చకోవడంతో ఎదుర్కోలు తంతు ముగిసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆలయ ఈవో గీతారెడ్డి, చైర్మన్ నర్సింహమూర్తితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వవిప్ గొంగిడి సునీత, జడ్పీటీసీ తోటకూరి అనురాధ-బీరయ్య, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కల్యాణానికి భారీ బందోబస్తు: మరోవైపు బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. మంగళవారం సాయంత్రం నిర్వహించే స్వామి అమ్మవార్ల కల్యాణ మహోత్సవాన్ని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామి వారికి ప్రభుత్వం తరపున పలువురు మంత్రులు, పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. స్వామివారి కల్యాణం సందర్భంగా ఆలయ ప్రాగణంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 350 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొనున్నారు.