తెలంగాణ

telangana

ETV Bharat / state

Drum Seeder in Yadadri : 'సాగు చేయడం చాలా కష్టం.. కానీ ఇలా చేస్తే సులభం' - డ్రమ్ సీడర్ తయారు చేసిన ఆలేరు రైతు

Drum Seeder in Yadadri : తండ్రి బాటలోనే వెళ్లిన ఆ యువరైతు.. నాన్నలాగే రైతుగా మారాడు. వ్యవసాయం చేయడమంటే ఎంత కష్టమైన పనో తెలుసుకుని.. 'మరి నాన్నెలా దీన్ని ఇంత ఇష్టంగా చేస్తున్నాడని' ఆశ్చర్యపోయాడు. ఎంత కష్టమైనా సరే తండ్రి బాటలోనే నడవాలనుకున్నాడు. పంట సాగులో కష్టాలను తెలుసుకుని దాన్ని ఇష్టంగా మార్చుకోవడమే కాదు సులభంగా చేసే పద్ధతిని అవలంభించాడు. దాని కోసం మొదటి స్టెప్.. 'విత్తనాలు చల్లడం'. ఈ పనికి కూలీల కొరత విపరీతంగా ఉండటాన్ని గమనించి కూలీలు అవసరం లేకుండా.. డ్రమ్ సీడర్​ను తయారు చేశాడు. ఈ డ్రమ్ సీడర్​తో కూలీ ఖర్చు తగ్గించడమే కాదు.. దాన్ని కిరాయికి ఇస్తూ ఉపాధి కూడా పొందాడు. ఇంతకీ ఆ యువరైతు ఎవరో తెలుసుకుందామా..?

Drum Seeder in Yadadri
Drum Seeder in Yadadri

By

Published : Jan 14, 2022, 12:50 PM IST

సాగు ఇలా చేస్తే సులభం

Drum Seeder in Yadadri : యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకకు చెందిన రేగు మల్లేశ్ అనే యువరైతు పాత వస్తువులతో డ్రమ్ సీడర్ తయారు చేశారు. తనకున్న నాలుగు ఎకరాల్లో ఏటా వరినాటు వేసే సమయంలో కూలీల కొరతతో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించాలని నిర్ణయించుకుని ఇంటి వద్ద ఉన్న పాత వస్తువులో డ్రమ్ సీడర్ పరికరాన్ని తయారు చేశారు.

ఒక్కరోజులోనే తయారీ..

Drum Seeder in Aler : ఆరు అడుగుల పొడవు, ఆరు ఇంచుల వెడల్పు గల ప్లాస్టిక్ పైపు కొనుగోలు చేశారు. రెండు సైకిల్ పాత రీములు, రెండు సీలింగ్ ఫ్యాను కప్పులు తీసుకున్నారు. అవసరమైన నట్లు, ఇనుప పట్టీలు సమకూర్చుకొని ఒక్క రోజులోనే స్వయంగా డ్రమ్ సీడర్ తయారు చేశారు.

కిరాయితో ఉపాధి..

Drum Seeder by Aler Farmer : డ్రమ్ సీడర్ తయారీకి 1,800 మాత్రమే ఖర్చయ్యిందని తెలిపిన మల్లేశ్.. ఈ పరికరంతో ఎనిమిది వరుసలుగా విత్తనాలు వేయవచ్చని తెలిపారు. డ్రమ్ సీడర్ ధర మార్కెట్లో సుమారు 6 వేల నుంచి 7 వేల 500 వరకు ఉందని వివరించారు. తాను తయారు చేసిన డ్రమ్ సీడర్‌ను ఎవరైనా రైతులు అడిగితే కిరాయికి ఇవ్వడం వల్ల ఉపాధి కూడా దొరుకుతుందని యువరైతు మల్లేశ్ వెల్లడించారు.

నాన్నకు ప్రేమతో..

'వరినాట్లు వేసే సమయంలో ఇక్కడ కూలీల కొరత తీవ్రంగా ఉంటుంది. ఒకవేళ దొరికినా.. ఎక్కువ నగదు ఇవ్వాల్సి ఉంటుంది. నాటు వేయడానికే చాలా ఖర్చవుతోంది. అందుకే కూలీలు లేకుండా విత్తనాలు వేసేందుకు డ్రమ్ సీడర్​ను తయారు చేశాను. దీనికి తక్కువే ఖర్చయింది. ఒకసారి ఈ సీడర్​లో 10 నుంచి 15 కిలోల విత్తనాలు నింపవచ్చు. ఒకసారి నింపితే ఎకరం విస్తీర్ణంలో విత్తనాలు వేయొచ్చు. ఇప్పటి నుంచి నేను డ్రమ్ సీడర్​ వరి సాగు చేస్తాను. అధిక లాభాలు గడిస్తాను. మా నాన్న జనరేషన్​కు నా జనరేషన్​కు చాలా తేడా ఉంది. ఆయన చాలా కష్టపడి పంట పండించే వాడు. కానీ నేను ఆధునిక పద్ధతిలో పంట పండించి మా నాన్నకు రెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను.'

- మల్లేశ్, యువరైతు

ABOUT THE AUTHOR

...view details