యాదాద్రి భువనగిరి జిల్లాకు మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు సీసీఎంబీ రాబోతుంది. ఇప్పటికే బీబీనగర్ మండలం రంగాపూర్‌లో ఎయిమ్స్ ఏర్పాటుపై సేవలు కొనసాగుతున్నాయి . తాజాగా వైద్య రంగానికి చెందిన కీలకమైన పరిశోధనా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. భువనగిరి పురపాలక పరిధిలోని బొమ్మాయిపెల్లి, పగిడిపల్లి గ్రామాల్లో 120 ఎకరాల స్థలం కేటాయించాలని ఆ సంస్థ కోరగా.. రెవెన్యూ పరంగా ఎలాంటి చిక్కులు లేని 48 ఎకరాల భూమిని కేటాయించేందుకు సీసీఎల్ఎ ప్రకటన జారీ చేయడం వల్ల ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం బొమ్మాయిపల్లి పరిధిలోని సర్వే నంబర్ 85లో 41 ఎకరాలు, పగిడిపల్లి పరిధిలోని సర్వే నంబర్ 86 లో 79 ఎకరాల భూమి అనువుగా ఉంటుందని ప్రభుత్వానికి జిల్లా పాలనాధికారి అనిత రామచంద్రన్ నివేదిక పంపారు. ఈ నేపథ్యంలో భూసేకరణ ప్రకటన వెలువడింది. భూసేకరణ పంపిణీ చట్టం- 2016 (2013 చట్టానికి సవరణ) కింద సేకరణకు సంబంధించి మినహాయింపు వర్తింపజేయాలంటూ చేయాలంటూ హైదరాబాద్ సీసీఎంబీ డైరెక్టర్ ప్రభుత్వానికి విన్నవించడం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
హైదరాబాద్‌లోని ఉప్పల్ రోడ్‌లో ఉన్న సీసీఎంబీ కేంద్రాన్ని విస్తరించే క్రమంలో తొలుత హైదరాబాద్- భూపాలపట్నం 163 జాతీయ రహదారి సమీపంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ మండలంలో ఏర్పాటుకు ప్రతిపాదించారు. నాటి నిమ్స్ ఆస్పత్రికి చేరువలో ఈ కేంద్రాలు ఏర్పాటు చేయాలని 2008లో అప్పటి ముఖ్యమంత్రి కోరగా, బీబీనగర్‌లో 171 ఎకరాల్లో రూ. 1200 కోట్లతో ఆ సంస్థను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. కేంద్ర ప్రణాళికా సంఘం ఆమోదం తెలిపింది.