Allu Arjun fans attack on theatre owner : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఓంకార్ థియేటర్లో 'పుష్ప' సినిమా టికెట్ల కోసం ఘర్షణ జరిగింది. లోకల్ వాళ్లకు టికెట్స్ ఇవ్వరా అంటూ స్థానిక యువకులు థియేటర్ యాజమాన్యంపై దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. థియేటర్ లీజుకు తీసుకున్న లింగం యాదవ్‌పై అల్లు అర్జున్ అభిమానులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. మేనేజర్ రూమ్‌లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. గ్లాస్ డోర్‌ని పగలగొట్టారు.
గోల్డ్ చైన్ మాయం
ఈ ఘటనలో థియేటర్ యజమాని లింగం యాదవ్ మెడలో ఉన్న 4 తులాల బంగారు చైన్, మేనేజర్ రూమ్‌లో ఉన్న రూ.40 వేల నగదు, రూ.20 వేల విలువ గల పుష్ప సినిమా టికెట్లు, సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్, మానిటర్ని ధ్వంసం చేసి ఎత్తుకెళ్లినట్లు లింగం యాదవ్ తెలిపారు. ఈ ఘటనలో గాయాలపాలైన ఓనర్... పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దుమ్మురేపిన కలెక్షన్లు
అల్లు అర్జున్, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన 'పుష్ప' చిత్రం శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. సుకుమార్ దర్శకత్వం, బన్నీ నటన, సినిమాటోగ్రఫీతో పాటు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి ప్లస్‌గా మారాయి. సమంత స్పెషల్ సాంగ్ కూడా థియేటర్లకు జనాల్ని రప్పించడంలో సఫలమైంది. దీంతో తొలిరోజే కలెక్షన్ల పరంగా దుమ్మురేపిందీ చిత్రం.