Budida Bikshamaiah Goud Resigns to BJP: ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ భాజపా నుంచి తిరిగి తెరాసలో చేరనున్నారు. ఆలేరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి ఎన్నికైన బూడిద బిక్షమయ్య గౌడ్ 2019లో తెరాసలో చేరి.. ఈ ఏడాది ఏప్రిల్‌లో భాజపాలో చేరారు. శుక్రవారం తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ సమక్షంలో తెరాసలో చేరనున్న బిక్షమయ్య... భాజపాకు రాజీనామా చేశారు. తెలంగాణ, బీసీల పట్ల కమలం పార్టీ తీవ్ర వివక్ష చూపుతున్నందునే ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన సుదీర్ఘ లేఖను విడుదల చేశారు.
మాజీ ఎమ్మెల్యేగా, రాజకీయాల్లో దాదాపు రెండున్నర దశాబ్దాల అనుభవం ఉన్న తనకు భాజపాలో అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయని బిక్షమయ్య ఆరోపించారు. రాష్ట్రంలో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేలా స్థానిక భాజపా నాయకత్వం మాట్లాడినా... కేంద్ర అధిష్ఠానం స్పందించక పోవడం తనను కలతకు గురి చేసిందన్నారు. యాదాద్రి దేవాలయానికి నయాపైసా సాయం చేయలేదన్నారు. ఫ్లోరైడ్ నివారణకు రూపాయి ఇవ్వకపోగా.. మర్రిగూడలో ఫ్లోరైడ్ బాధితుల కోసం కట్టిస్తామన్న 300 పడకల ఆసుపత్రికి ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం.. వంటి హామీలపై భాజపా స్పందించక పోవడం మనస్థాపానికి గురిచేసిందన్నారు. రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసం భాజపాలో చేరి ఉపఎన్నిక తెచ్చారన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజకీయాలకు వ్యతిరేకంగా.. భాజపాకు రాజీనామా చేస్తున్నట్లు బూడిద బిక్షమయ్య గౌడ్ తెలిపారు.