wife protest against to her husaband in aleru: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని రామ్ శివాజీ నగర్‌కు చెందిన భార్గవిని తన ఇంటి పక్కనే ఉండే మణికంఠ ప్రేమించానని వెంటపడ్డాడు. నువ్వు లేకపోతే చనిపోతానని అమ్మాయిని భయపెట్టి లొంగతీసుకున్నాడు. రెండేళ్లు సహజీవనం చేసిన తర్వాత మా ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదని వదిలిపెట్టాడు. వేరే గత్యంతరం లేక ఆ అమ్మాయి తల్లిదండ్రులు చూసిన పెళ్లి సంబంధాన్ని ఒప్పుకొని పెళ్లికి సిద్ధమైంది. తీరా వివాహానికి రెండు రోజులు ఉందనగా అమ్మాయి వద్దకు వెళ్లి నువ్వు నాతో సహజీవనం చేసిన ఫోటోలు, వీడియోలు అన్ని ఉన్నాయి. నీవు నన్ను పెళ్లి చేసుకోకపోతే అవన్నీ బయట పెడతానని బెదిరించాడు. భార్గవి కన్న వాళ్లు చూసిన పెళ్లిని కాదని ఇంట్లో వాళ్లను ఎదిరించి ప్రేమించిన అబ్బాయితో వెళ్లిపోయింది. ఇద్దరు పెళ్లి చేసుకొని వేరు కాపురం పెట్టారు. కొన్ని నెలలు వాళ్ల కాపురం సాఫీగా సాగింది.
ప్రెగ్నెన్సీతో మొదలైన సమస్య:ఇంతవరకు బాగానే ఉంది.. అయితే భార్గవికి ప్రెగ్నెన్సీ రావడంతో వద్దని అబార్షన్ చేసుకోమని పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేశాడు మణికంఠ. భార్గవి ససేమిరా ఒప్పుకోకపోవడంతో ఆమెను వారి తల్లిదండ్రుల ఇంటి వద్ద వదిలిపెట్టి హైదరాబాద్ వెళ్లాడు. భార్గవి డెలివరీ అయ్యి పాపకు జన్మనిచ్చింది. హైదరాబాద్ వెళ్లిన మణికంఠ 15 నెలలు గడుస్తున్నా ఇంటికి రాలేదు. కనీసం పాప పుట్టినప్పుడు కూడా చూడ్డానికి రాలేదని పలుమార్లు ఫోన్లో సంప్రదించగా.. అసభ్యకరంగా మాట్లాడి నీవు నాకు అవసరం లేదు, నీ కూతురు నాకు అవసరం లేదని.. ఏం చేసుకుంటావో చేసుకో.. నీకు నాకు సంబంధం లేదని చెప్తున్నాడని భార్గవి బోరున విలపించింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ చంటి బిడ్డతో పెట్రోల్ క్యాన్ పట్టుకొని మహిళ సంఘాల ఆధ్వర్యంలో మణికంఠ ఇంటి ముందు టెంట్ వేసుకొని నిరసన దీక్ష చేపట్టింది. తనకు న్యాయం చేయాలని న్యాయం జరగకుంటే కూతురుతో కలిసి అబ్బాయి మణికంఠ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించింది.