తెలంగాణ

telangana

ETV Bharat / state

మినీ మగ్గం... చేనేత మహిళలకు వరం - చేనేత మహిళలకు అండగా మినీ మగ్గం

చింతకింది మల్లేశం... ఈ పేరు చెబితే మనకు గుర్తొచ్చేది ఆసుయంత్రం. చేనేత రంగంలో ఓ కొత్త అధ్యాయానికి తెర తీసిన పరికరం. తల్లి శ్రమను తగ్గించేందుకు మల్లేశం ఆసు యంత్రాన్ని కనిపెడితే చేనేత రంగంలో ఉన్న మహిళల శ్రమను తగ్గించేందుకు మినీ మగ్గాన్ని తయారు చేశారు ఆచార్య జయశంకర్​ విద్యాలయం శాస్త్రవేత్తలు. యాదాద్రి జిల్లా కొయ్యలగూడెంలోని చేనేత కార్మికుడు దుద్యాల శంకర్​ ఇంట్లో దీనిని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు.

మినీ మగ్గం

By

Published : Aug 9, 2019, 1:13 PM IST

Updated : Aug 9, 2019, 2:18 PM IST

మినీ మగ్గం... చేనేత మహిళలకు వరం

గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది మహిళలు చేనేత రంగంపై ఆధారపడి బతుకుతున్నారు. అయితే గుంతలో కూర్చొని వస్త్రాలు నేయడం కొంచెం కష్టతరమైన పని. చేనేత మహిళల కష్టాన్ని గుర్తించిన జయశంకర్​ విశ్వవిద్యాలయం వారు ప్రయోగాత్మకంగా మినీ మగ్గం తయారు చేశారు. నీతి ఆయోగ్​ ద్వారా అఖిల భారత సమన్వయ పరిశోధక పథకం కింద ఈ ప్రాజెక్టును చేపట్టారు.

ఇబ్బందులపై అధ్యయనం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొయ్యలగూడెం, పుట్టపాక గ్రామాలు చేనేత రంగానికి ప్రసిద్ధి. ఈ గ్రామాల్లోని చేనేత కళాకారులు ఎన్నో జాతీయ అవార్డులు సైతం అందుకున్నారు. ఇటీవల ఈ గ్రామాలను సందర్శించిన జయశంకర్ విశ్వవిద్యాలయం అధికారులు చేనేత కార్మికుల ఇబ్బందులపై అధ్యయనం చేశారు. చీరల తయారీలో పురుషులతో పాటు మహిళా చేనేత కార్మికులు కూడా శ్రమ పడాల్సిందే. ఎన్నో ఏళ్లుగా చేనేత వృత్తి పనులు చేస్తున్న మహిళలు శారీరక శ్రమతో పాటు పోషకాహారం లోపం వల్ల ఈ పనులు చేయలేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. గుంత మగ్గంలో రోజుకు 8 గంటలు నేయడం వల్ల వెన్నునొప్పి, కీళ్లనొప్పులు వస్తున్నాయని చెప్పడం వల్ల దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించారు. గ్రామానికి చెందిన ప్రకృతి రంగ నిపుణుడు దుద్యాల శంకర్ ఇంట్లో మినీ మగ్గాన్ని ఏర్పాటు చేశారు. అంతకు ముందున్న దానికి... ఇప్పటి దానికున్న తేడాను గమనిస్తున్నారు. శారీరక శ్రమ తగ్గిందా అన్న అంశాలపై అధ్యయనం చేస్తున్నారు.

శ్రమ తగ్గింది...

గుంత మగ్గంతో పోలిస్తే మినీమగ్గంతో శారీరక శ్రమ తగ్గి... రెండింతలు ఎక్కువ పని చేయగలుగుతున్నామని చేనేత కార్మికులు చెబుతున్నారు. రెండు రోజుల్లో చేసే పనిని దీనిలో ఒకే రోజులో చేయగలుగుతున్నట్లు తెలిపారు. మరోవైపు సులభంగా ఎక్కడికైనా తరలించే వెసులుబాటు ఉంటుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయం, చేనేత రెండు కళ్లవంటివన్నారు జాతిపిత మహాత్మాగాంధీ. చేనేత కార్మికుల ఇబ్బందులు తీర్చేందుకు విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చూపిన చొరవ అభినందనీయం. ఈ రంగంలో మరిన్ని ఆవిష్కరణలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మినీమగ్గం పరికరం విజయవంతం అయితే రాష్ట్రవ్యాప్తంగా వీటిని అందజేయనున్నారు.

ఇదీ చూడండి : ప్రాజెక్టులతో 30 లక్షల ఎకరాలకు సాగునీరు

Last Updated : Aug 9, 2019, 2:18 PM IST

ABOUT THE AUTHOR

...view details