వాహనం పోయినా, వస్తువు పోయినా, ఇంట్లో దొంగతనం జరిగినా ఆ సొత్తు మళ్లీ మన చేతికి ఎప్పుడు వస్తుందో.. అసలు వస్తుందో రాదో తెలియదు. పోలీసులకు ఫిర్యాదు చేసి నెలల తరబడి వేచి ఉన్నా... పూర్తిస్థాయిలో సొమ్ము రికవరీ చేయడం చాలా అరుదు. మరి దొంగతనానికి పాల్పడిన వ్యక్తి ఆ వస్తువును మరుసటి రోజు యథావిధిగా దొంగతనం చేసిన చోట పెట్టిపోతే ఎలా ఉంటుంది? వినడానికి విచిత్రమే. కానీ నిజంగా ఇది జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో జరిగిన దొంగతనం(Bike theft) ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
జిల్లాలోని రామన్నపేట మండలం సూరారం గ్రామానికి చెందిన నర్సింహ.. మంగళవారం మోత్కూరుకు వచ్చారు. తనకు మనవడు పుట్టాడన్న సంతోషంలో తన మిత్రులతో కలిసి మద్యం దుకాణానికి వెళ్లారు. తన బైక్‌ను పోతాయిగడ్డలో ఉన్న వైన్స్ ముందు పెట్టి, మద్యం సేవించడానికి వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి బైక్(Bike theft) కనిపించలేదు. దీంతో నర్సింహ తన బైక్ ఎవరో దొంగలించారని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు మళ్లీ మోత్కూర్‌కి వచ్చి అదే వైన్స్ ముందు చూసేసరికి తన వాహనం అక్కడే కనిపించింది.