తెలంగాణ

telangana

ETV Bharat / state

చేనేత అద్భుతం: ఒకే చీరపై 121రంగులు, 121డిజైన్లు - telangana varthalu

దారం పోగుల నుంచి చీర నేయడం అనేది ఓ గొప్ప కళ. ఎంతో కష్టపడితే కాని ఒక చీర పూర్తికాదు. ఇంకెంతో కష్టపడి రకరకాల డిజైన్లు, రంగులు వేసి ఆకట్టుకునేలా చీరలు తీర్చిదిద్దుతారు నేతన్నలు. అలాంటిది ఒకే చీరపై 121 రంగులు, 121 డిజైన్లు నేయడం అసాధారణ విషయం. అలాంటి గొప్ప నైపుణ్యాన్ని సాధించాడు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి చెందిన భోగ బాలయ్య.

చేనేత అద్భుతం: ఒకే చీరపై 121రంగులు, 121డిజైన్లు
చేనేత అద్భుతం: ఒకే చీరపై 121రంగులు, 121డిజైన్లు

By

Published : Feb 21, 2021, 2:43 AM IST

చేనేత అద్భుతం: ఒకే చీరపై 121రంగులు, 121డిజైన్లు

చీరల ఎంపిక అంటే ఒక పట్టాన తెగేది కాదు. దుకాణాదారుడు ఎన్ని డిజైన్లు చూపించినా ఇంకా కొత్త కొత్త డిజైన్లు కావాలని చాలా మంది మగువలు ఆశిస్తారు. అందుకు తగ్గట్లు చీరల్లో ఎప్పటికప్పుడు నూతన డిజైన్లను అందుబాటులోకి తీసుకువస్తారు తయారీదారులు. ఈ పోటీలో చేనేత కళాకారులు కొంత వెనకబడ్డారనే చెప్పాలి. చేనేతలోనూ రకరకాల డిజైన్లతో... చూడగానే ఆకట్టుకునేలా ఉండాలని తలంచి దాదాపు రెండున్నరేళ్లు కష్టపడి ఈ చీరకు ప్రాణం పోశాడు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లికి చెందిన చేనేత కార్మికుడు భోగ బాలయ్య.

కుటుంబసభ్యుల సహకారంతో..

121 రంగులు.. 121 డిజైన్లతో చీర నేశాడు భోగ బాలయ్య. ఈ చీరలో ఆకుపచ్చ, చిలకపచ్చ, బంగారు వర్ణం, గోధుమ, గులాబీ, లెమన్, గ్రే, ఆరెంజ్ , ఎల్లో, వైలెట్, నీలి రంగులు ఉన్నాయి. పూర్తిగా వాషబుల్‌, ఎకో ఫ్రెండ్లీ, వాస్ట్‌ కలర్స్‌ వాడారు. 11 రంగులతో ట్రెడిషనల్‌ టెంపుల్‌ డిజైన్‌ అంచు ఈ చీర మరో ప్రత్యేకత. దీనిని పూర్తిగా కుటుంబసభ్యుల సహకారంతో బాలయ్యే తయారు చేశారు. కోయంబత్తూరు నుంచి ప్రత్యేకంగా మస్టర్డ్‌ నూలు తెప్పించారు. 22 చిటికీలు, ఒక చిటికీకి 22 కొయ్యలు, ఆరు కొలుకులను చీర తయారీకి ఉపయోగించారు.

గతంలో 1600 రంగులతో..

భోగ బాలయ్య గతంలో ఒకే చీరపై 1600 రంగులతో చీర నేసి పలువురి ప్రశంసలు అందుకున్నారు. ఇటీవలే పోచంపల్లిని సందర్శించిన ఐఏఎస్​ అధికారి చిరంజీవులు.. బాలయ్య రూపొందించిన మల్టీకలర్ చీరను చూసి అభినందించారు. ఒక చీర నేయటంలో సుమారు 10 రంగులు వినియోగిస్తారు. అలాంటిది ఇన్ని రంగులు వినియోగించి చీరని నేయటం మాటలు కాదు. దీనికి ఎంతో నేర్పు, ఓర్పు, సహనం ఉండాలి. తన భార్య, పిల్లల సహాయ సహకారాలు, ప్రోద్భలంతో ఈ చీరలను నేసానని బాలయ్య పేర్కొన్నారు. ప్రభుత్వం సాయం అందిస్తే మరిన్ని చీరలు తయారు చేస్తానని తెలిపారు.

సాయమందించండి..

చేనేత కార్మికులలో సృజనాత్మకతకు కొదవ లేదని.. కావాల్సిందల్లా వారికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు, భరోసా అని స్థానికులు అంటున్నారు. నేతన్నలకు సాయమందిస్తే... భవిష్యత్‌లో అధునాతన డిజైన్‌లు తీసుకురాగలరని చెబుతున్నారు.

అవార్డు కోసం దరఖాస్తు

121 రంగులు, 121 డిజైన్లతో రూపొందించిన ఈ చీరను జాతీయ అవార్డు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు భోగ బాలయ్య తెలిపారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం పంపినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: తెలుగు వర్ణమాలను అందంగా తీర్చిదిద్దుతున్న అంబరీష

ABOUT THE AUTHOR

...view details