తెలంగాణ

telangana

ETV Bharat / state

గగుర్పొడిచిన యాదగిరిగుట్ట ఘటన.. నలుగురు మృతి, మరొకరికి తీవ్రగాయాలు..

Building Collapsed in Yadagirigutta: రెండంతస్తుల భవనం ముందు భాగం కూలిన ఘటనలో.... నలుగురు దుర్మరణం చెందడం.. యాదగిరిగుట్టలో తీవ్ర విషాదం నింపింది. నలుగురు స్నేహితులు మాట్లాడుతుండగా ఒక్కసారిగా బాల్కనీ కుప్పకూలడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతిచెందారు. ఒకరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. పెద్దదిక్కుగా ఉన్నవారు అనుకోని ప్రమాదంలో విగతజీవులుగా మారడంతో.... కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి.

4 died and one severely injured in Building Collapsed incident in Yadagirigutta
4 died and one severely injured in Building Collapsed incident in Yadagirigutta

By

Published : Apr 30, 2022, 5:47 AM IST

Updated : Apr 30, 2022, 7:11 AM IST

గగుర్పొడిచిన యాదగిరిగుట్ట ఘటన.. నలుగురు మృతి, మరొకరికి తీవ్రగాయాలు..

Building Collapsed in Yadagirigutta: శిథిలావస్థకు చేరిన ఓ రెండంతస్తుల భవనం ముందు భాగం కూలి... నలుగురు మృతిచెందిన ఘటన యాదగిరిగుట్ట వాసులను ఉలికిపాటుకు గురిచేసింది. శ్రీరాంనగర్‌లోని రెండంతస్థుల భవనాన్ని 40 ఏళ్ల క్రితం నిర్మించారు. ఐదేళ్ల క్రితం ఆ భవనానికి ముందుభాగంలో స్లాబ్‌ వేసి విస్తరించారు. అందులో రెండు షట్టర్లను వేసి ఓ దాంట్లో వస్త్రదుకాణం, మరో దాంట్లో బ్యాటరీ రీఛార్జ్‌ షాపు నిర్వహిస్తున్నారు. యజమాని దశరథ ఆ భవనంపైనే నివసిస్తున్నారు. ఐదేళ్ల క్రితం స్లాబ్‌ వేసిన భాగం కుప్పకూలడంతో..... పైన ఉన్న దశరథతో పాటు వస్త్ర దుకాణ నిర్వాహకుడు శ్రీనివాస్‌, అతడి స్నేహితులు శ్రీనాథ్‌, సుంగి ఉపేందర్‌ మృత్యువాత పడ్డారు. దశరథ, శ్రీనాథ్, ఉపేందర్‌ అక్కడికక్కడే మృతిచెందగా...శ్రీనివాస్‌ను భువనగిరి ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మరణించారు.

ఈ ఘటనలో బ్యాటరీ దుకాణం నిర్వాహకుడైన గిరి తీవ్రంగా గాయపడటంతో ఆయనను తొలుత భువనగిరి కేంద్రాసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. మృతిచెందిన వారిని శవపరీక్షల నిమిత్తం భువనగిరి కేంద్రాసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టినా.... భారీ బరువున్న స్లాబ్‌ ఒక్కసారిగా పడటంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉందని పోలీసువర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో మృతిచెందిన శ్రీనివాస్, శ్రీనాథ్, ఉపేందర్‌తోపాటు గాయపడిన గిరి చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్నారు. స్నేహితులంతా కలిసి మాట్లాడుతుండగా ఈ ఘటన జరగడం తీవ్రంగా కలచివేసింది.

భాగ్యనగరంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కొలువు చేస్తున్న శ్రీనాథ్ తండ్రి ఆరోగ్యం బాగా లేకపోవడంతో యాదగిరిగుట్టకు వచ్చి.... కొంత కాలంగా ఇక్కడి నుంచే హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నారు. ఈయనకు ఏడాదిన్నర వయసున్న పాప ఉండగా..., భార్య సంగీత ప్రస్తుతం గర్భవతి. శ్రీనాథ్‌ మరణంతో ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. యాదగిరిగుట్ట అంగడిబజార్‌లో ఆయుర్వేద వైద్యం చేసే సుంగి ఉపేందర్‌కు భార్య స్వాతితో పాటూ ఇద్దరు పదేళ్లలోపు ఆడపిల్లలున్నారు. ఉపేందర్‌ అకాల మరణంతో ఆ కుటుంబం దిక్కులేనిదయింది.

వస్త్ర దుకాణం నిర్వహిస్తున్న శ్రీనివాస్‌కు భార్య రమ్యతోపాటు 14 ఏళ్లలోపు ఇద్దరు ఆడపిల్లలున్నారు. అప్పటివరకు తమతో సరదాగా మాట్లాడిన తండ్రి...ఒక్కసారిగా విగతజీవిగా మారడంతో వారి రోదనలు మిన్నంటాయి. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భవన యజమాని దశరథకు భార్యతో పాటు నలుగురు కొడుకులు, ఓ కూతురున్నారు. బాల్కనీలో ఉన్న సమయంలో స్లాబ్‌ కూలడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. అందరివీ పేద కుటుంబాలు కావడం, ప్రస్తుతం కుటుంబ ఆర్థిక బాధ్యతలు మోస్తుండటంతో... వారిని తలుచుకుని కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

యాదగిరిగుట్ట విషాద ఘటనపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన ఆమె.... క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.

ఇదీ చూడండి:

Last Updated : Apr 30, 2022, 7:11 AM IST

ABOUT THE AUTHOR

...view details