YS Sharmila Fires On State Government: కేసీఆర్ ప్రభుత్వం.. పేదల ప్రభుత్వం కాదని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. మద్యం అమ్మకాల్లో తెలంగాణ ప్రధమ స్థానంలో నిలిచిందని విమర్శించారు. ఇది దొరల రాజ్యం.. దొంగల ప్రభుత్వమని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ నాయకులు డబ్బులు సంపాదించుకునేందుకు మాత్రమే ఈ ప్రభుత్వం ఉందని ఆక్షేపించారు. హనుమకొండ జిల్లాలో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
బంగారు తెలంగాణ అని పేదవారికి బ్రతుకు లేని తెలంగాణ చేశారని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ వర్గాన్ని ఆదుకొనే దిక్కు లేదని దుయ్యబట్టారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే పరిహారం ఇచ్చే దిక్కు లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు చనిపోతుంటే ఆపడం చేతకాని ప్రభుత్వమని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజల కోసం నిలబడి కొట్లాడే పార్టీ కరవైందని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒకటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి పెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో పాదయాత్ర చేస్తున్నట్లు వైఎస్ షర్మిల తెలిపారు.
"నేను పార్టీ పెట్టాను ఎందుకంటే ఈరోజు తెలంగాణలో మాట మీద నిలబడే నాయకుడే కనిపించడం లేదు. ప్రజల కోసం నిలబడి కొట్టాడే పార్టీ లేదు. రాజశేఖర్రెడ్డి పెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. అందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీని పెట్టాను. మీరందరూ నన్ను ఆశ్వీరిందించండి. మళ్లీ రాజశేఖర్రెడ్డి పాలన మీ చేతుల్లో పెడతానని మాట ఇస్తున్నాను." - వైఎస్ షర్మిల, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు