Young Woman got doctor seat is working laborer due to poverty: హనుమకొండ జిల్లా నడికూడ మండలం ముస్త్యాలపల్లి గ్రామానికి చెందిన బోళ్ల స్వామి,వసంత దంపతుల కుమార్తె సంజన. చిన్నతనం నుంచి చదువులో మేటి. ఇంట్లోఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే. రోజు కూలీ పనికి వెళ్తే కానీ కడుపు నిండని దుస్థితి. దీంతో ప్రాథమిక విద్యను స్థానిక ప్రభుత్వ బడిలో పూర్తిచేసింది. తల్లిదండ్రుల కష్టాన్ని చూసిన ఆమె.. కష్టపడి చదివి తన ప్రతిభతో ఉత్తమ విద్యార్థిగా ఎంపికైంది. దీంతో హనుమకొండలోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్‌లో ఉచిత విద్యకు అవకాశం కల్పించారు. పదో తరగతిలో 9.8 జీపీఏ సాధించింది. కరీంనగర్‌లోని ఓ కళాశాలలో బైపీసీ లో చేరిన సంజన.. 988 మార్కులు సాధించింది. గౌల్ దొడ్డి సోషల్ వెల్ఫేర్‌లో ఐదు నెలల కోచింగ్ తీసుకుని నీట్ పరీక్ష రాసి ఎంబీబీఎస్‌కు అర్హత సాధించింది.
"నేను చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాను. మొదటినుంచి మంచి ప్రతిభ కనబరచడం వల్ల హనుమకొండలోని సెయింట్ జోసెఫ్ స్కూల్‌లో సీటు వచ్చి 10వ తరగతి వరకు చదువుకున్నాను.. 10వ తరగతిలో 9.8 పాయింట్లు వచ్చాయి. ఇంటర్‌లో 988 మార్కులు వచ్చాయి. తరవాత ఐదు నెలలు నీట్ ఎగ్జామ్‌కు కోచింగ్ తీసుకున్నాను. నీట్‌లో స్టేట్ ర్యాంకు 9000లో వచ్చింది. దీంతో సిద్ధిపేటలోని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. ఆ పరిస్థితి బాగోలేక.. అమ్మనాన్నలతో కలిసి కూలి పనికి వెళుతున్నాను. నా ఆశయం ఎంబీబీఎస్ చదివి.. పేదలకు సహాయం చేయాలి." - సంజన, విద్యార్థిని
పిల్లలు బాగా చదివి ఉన్నతస్థాయికి ఎదుగుతారనే ఆశతో.. కూలీ పనులు చేసుకుంటూ.. స్వామి,వసంత దంపతులు కష్టమైన చదివిస్తున్నారు. సంజనకు సిద్దిపేట జిల్లాలోని సురభి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. వైద్యవిద్య.. ఖర్చుతో కూడుకున్న వ్యవహారమైనా.. బిడ్డ కోసం రూ.1.20 లక్షలు అప్పుచేసి కళాశాలలో చేర్పించారు. సంజన కాలేజీకి వెళ్లాలంటే.. మరోలక్ష రూపాయలు అవసరం. ఆ తల్లిదండ్రుల దగ్గర అంత డబ్బు లేక.. బిడ్డను చదువు మన్పించి.. వారితోపాటు కూలీ పనులకు తీసుకెళ్లున్నారు.