తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలుగు భాషకు మళ్లీ పూర్వవైభవం రానుంది: రామా చంద్రమౌళి - కాళోజీ పురస్కారం 2020 వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందించే కాళోజీ నారాయణ అవార్డు ఈసారి వరంగల్​కు చెందిన ప్రముఖ రచయిత, కవి రామా చంద్రమౌళిని వరించింది. కాళోజీ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఈ పురస్కారాన్ని బుధవారం అందించనుంది. అవార్డు దక్కడం పట్ల రామా చంద్రమౌళి సంతోషం వ్యక్తం చేశారు. కాళోజీ పురస్కారం అందడం గొప్ప అనుభూతిని కలిగిస్తోందన్నారు. రానున్న రోజుల్లో తెలుగు భాషకు మళ్లీ పూర్వవైభవం ఖాయమని అంటున్న కవి రామా చంద్రమౌళితో ప్రత్యేక ముఖాముఖి.

తెలుగు భాషకు మళ్లీ పూర్వవైభవం రానుంది: రామా చంద్రమౌళి
తెలుగు భాషకు మళ్లీ పూర్వవైభవం రానుంది: రామా చంద్రమౌళి

By

Published : Sep 9, 2020, 6:14 AM IST

తెలుగు భాషకు మళ్లీ పూర్వవైభవం రానుంది: రామా చంద్రమౌళి

కాళోజీ పురస్కారం మీకు రావడంపై మీ స్పందన... కాళోజీతో మీకున్న అనుబంధం.. పరిచయం.. ?

ఈ పురస్కారం రావడం నాకు మహదానందంగా ఉంది. సకల జనుల గొడవను తన గొడవగా చేసుకొని రెండు మూడు తరాలను ప్రభావితం చేసిన గొప్ప ప్రజాకవి కాళోజీ. తెలంగాణ ఏర్పడగానే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాహిత్యంపై గల గౌరవంతో కాళోజీ పేరుతో పురస్కారాలు ఏర్పాటు చేసి ప్రధానం చేయడం హర్షించదగిన విషయం. కాళోజీతో నాకు 30 సంవత్సరాల సాన్నిహిత్యం ఉంది. అనేక సాహితీ చర్చల్లో కలిసి పాల్గొన్నాను. ఇవాళ ఆయన పురస్కారం నాకు రావడం వల్ల వచ్చే ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. కాళోజీ గురువు గారపాటి రాఘవరెడ్డి నాకు గురువుగా లభించడం చిత్రమే. కాళోజీ అత్యంత ఆవేశం కలిగిన స్వభావం గల కవి. ఎన్నికలు బహిష్కరించండని మావోయిస్టులు పిలుపునిస్తే బేఖాతరు చేస్తూ ఓటు వేసి వచ్చిన ధీశాలీ కాళోజీ. మానవ సమూహం ఒకే గౌరవం పొందాలని కోరుకున్నారు. తన నిరసనను కవిత్వం రూపంలో వ్యక్తీకరించి ప్రజలను చైతన్యపరిచారు. ఆవేశం వస్తే మహోగ్రరూపంలో.. దు:ఖం వస్తే విలపించడం ఆయన తత్వం. అన్ని రకాల జ్ఞాన సంపదను అందించే ఒక కళాశాల కాళోజీ. హక్కులే కాదు బాధ్యతల గురించి పోరాడాలని చెబుతారు. తెలంగాణ దోపిడికి గురవుతోందంటూ తన కవితల ద్వారా నిరసన వ్యక్తం చేశారు. మూడు తరాల యువతను ప్రభావితం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన వెనుక ఆయన, ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఒక ప్రేరణగా నిలిచారు. తెలంగాణ మాండలికాన్ని అవమానిస్తే తట్టుకోలేకపోయేవారు.

అధ్యాపకుడిగా ఉండి....సాహిత్యంవైపు ఎలా వచ్చారు. ?

కళ ఏదైనా దైవదత్తంగా సంక్రమిస్తుందని నేను నమ్ముతున్నా. తపస్సుగా భావించి సాధన చేయాలి. రచన శక్తి పుట్టిన నాటి నుంచే ఉందని భావిస్తున్నా. చందమామ పిల్లల మాసపత్రికలో తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే నా కథ ప్రచురితమైంది. మా మాస్టారు తిడతారు అనుకున్నా... కానీ అప్యాయంగా కౌగిలించుకొని... నీలో మంచి రచయిత దాగి ఉన్నాడని ప్రసంసించడం ఎప్పటికీ మరిచిపోలేను. కవి, రచయితలకు నిరంతర సాధన అవసరం.

కాలనాళిక పుస్తక రచన నేపథ్యం ఏంటీ...?

చరిత్రలో నిలిచిపోయే విధంగా పుస్తకం రాయాలని అనిపించి తెలంగాణ ఉద్యమాన్ని ఇతివృత్తంగా తీసుకొని కాలనాళిక పుస్తకాన్ని రాశాను. ఏళ్ల తరబడి జరిగిన దొపిడిని ఈ పుస్తకంలో రచించాను. 80 ఏళ్ల తెలంగాణ చరిత్ర పోరాట కాలన్ని పుస్తక రూపంలో ఈ తరానికి రాబోయే తరాలకి అందించాలన్న ఉద్దేశ్యంతోనే కాలనాళిక రాశాను. ఇది నవల కాదు.. ఇతిహసం అన్న గుర్తింపు రావడం ఆనందంగా ఉంది.

మిమ్మల్ని కవిగా పిలవాలా... కథా రచయితగానా.. నవలా రచయితగానా..?

కవిత్వం అంటే నాకు ఎంతో ఇష్టం. కవిత్వం రాసిన విన్నా మనసు పులకరించిపోతుంది. బయటకు చెప్పలేని అంతరంగిక అనుభూతికి లోనవుతాను. కవిత్వం రాయడం ఇంకా ఇష్టం. కవి నిరంతర అధ్యయనం చేయాలి. మనుషుల జీవితాలే నాకు కథాంశాలు. ఏసీ రూంలో కూర్చుంటే కథా వస్తువులు దొరకవు. రచయితలు సమాజహితం కోరాలి.

తెలుగు భాషపై అభిమానం పట్టు తగ్గుతున్నాయ్ ఎందుకు?

తెలుగు భాష మృతభాషగా మారుతోందని అంటున్నా.. తెలుగు భాష ఎప్పటికీ మరణించదు. మాతృభాష పట్ల నిర్లక్ష్యం ఎక్కువవుతోంది అన్నది నిజమే. పాశ్చాత్య ప్రభావమే దీనికి కారణం. మమ్మి, డాడీ సంస్కృతి పోయి అమ్మ, నాన్న అంటూ తల్లిదండ్రులు పిలిపించుకోవాలి. కానీ ఇది తాత్కాలికమే. మళ్లీ అందరిలో తెలుగు భాషపై అభిమానం పెరుగుతోంది. భక్తి ప్రవచనాలు ఎక్కువగా చూస్తున్నారు. కరోనా వచ్చిన తర్వాత మన సంప్రదాయాలు, మన సంస్కృతికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. విచక్షణతో సత్యాన్ని గ్రహిస్తున్నారు. యువతరానికి సాహిత్యంపట్ల ఆసక్తి పెరుగుతోంది. మళ్లీ తెలుగుకు పూర్వవైభవం ఖాయం.

ఇదీ చదవండి:రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ను నియమించిన ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details