Thousand Pillars Temple Kalyana Mandapam: హనుమకొండలోని వేయిస్తంభాల గుడి చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. కాకతీయుల-మహోజ్వల చరిత్రకు నిదర్శనమైన 850 ఏళ్ల నాటి పురాతన కట్టడమిది. ఈ ఆలయానికి అనుబంధంగా నిర్మించిన కళ్యాణ మండపం ఆ కాలం నాటి శిల్పకళా ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. మండప నిర్మాణం మెుత్తం రాతి స్తంభాలతోనే జరిగింది. అప్పట్లో ఈ మండపంలో ఉదయం, సాయంత్రం నాట్యప్రదర్శనలు జరుగుతుండేవని శాసనాలను బట్టి తెలుస్తోంది.
రుద్రదేవుడు ప్రతిరోజు ఈఆలయానికి వచ్చి రుద్రేశ్వరుడికి పూజలు జరిపేవాడని.. అనంతరం కల్యాణ మండపంలో జరిగే నృత్య ప్రదర్శనలు తిలకించేవారని కథనాలు చెబుతున్నాయి. అయితే వేల ఏళ్ల కిందట నిర్మించిన వేయిస్తంభాల గుడి ఆవరణలోని కళ్యాణ మండపం కొంత కుంగిపోయింది. దీనిని ఇలాగే వదిలేస్తే ఆలయం పుర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని గుర్తించిన కేంద్ర పురావస్తు శాఖ.. 15 ఏళ్ల కిందట దీని పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టింది. కాకతీయులు కళ్యాణ మండప నిర్మాణంలో అత్యంత క్లిష్టమైన సాండ్‌బాక్స్ టెక్నాలజీని వాడారు. అంటే.. ఇసుకనే పునాదిగా చేసుకొని నిర్మాణం చేపట్టారు.