Attack on Women in Warangal : అత్యద్భుత శిల్పసంపద.. తెగువ మారుపేరైన పడతులు నడయాడిన నేల.. నేడు తెలంగాణలోనే అతివేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం ఓరుగల్లు. అలాంటి ప్రతిష్ఠ కలిగిన ఈ నేల.. కొందరు ఉన్మాదుల ఆకృత్యాలతో చెడ్డపేరు మూటకట్టుకుంటోంది. వేల మంది కలిగిన సైన్యాలను ఒంటిచేత్తో మట్టి కరిపించిన రాణీ రుద్రమ, సమ్మక్క వంటి పోరాటయోధురాళ్లు పుట్టిన ఈ మట్టిలో.. నేడు అమ్మాయిలకు భద్రత కరువైంది. ఇంటి నుంచి బయటకు వెళ్తే ఎవరు వేధిస్తారో.. ప్రేమ పేరుతో ఎవరు వెంటపడతారో.. ఒప్పుకోకపోతే ఎక్కడ హతమారుస్తారోనని అనుక్షణం భయంతో బతకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ ఆడపిల్లలను చదువుకోసమని బయటకు పంపాలని.. వారి భవిష్యత్‌కు బంగారు బాట వేయాలని తపిస్తున్న తల్లిదండ్రులకు ఈ ప్రేమోన్మాదులు వణుకు పుట్టిస్తున్నారు. స్వప్నిక.. రవళి.. హారతి.. నిన్న అనూష.. ఇలా వీరి లాంటి పరిస్థితి తమ కూతుళ్లకు ఎక్కడ వస్తుందోనని కన్నవాళ్లు.. క్షణక్షణం భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు.
గొంతు కోసిన ప్రేమ : శుక్రవారం రోజున హనుమకొండలో అనూష అనే యువతిని అజార్ అనే యువకుడు గొంతుకోసి హతమార్చడం సభ్యసమాజాన్ని నివ్వెరపరిచింది. కాకతీయ యూనివర్సిటీలో ఎంసీఏ పూర్తి చేసి.. పోటీ పరీక్షల కోసం హైదరాబాద్‌లో శిక్షణ తీసుకుంటూ గురువారం రోజున తన సొంతూరుకు వెళ్లిన అనూష.. ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో అజార్ చొరబడ్డాడు. తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో గొంతు కోశాడు. ఆమె కొనప్రాణాలతో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతోంటే.. పైశాచిక ఆనందాన్ని పొందుతూ చోద్యం చూశాడు. 'నన్ను ప్రేమించని నీకు ఇదే గతి పట్టాలి' అని అనుకుంటూ అక్కణ్నుంచి పరారయ్యాడు.
అనూష కంటే ముందు మరో అమ్మాయి : ఈ ఘటన జరిగిన 24 గంటలలోపే అజార్‌ను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొదటి నుంచి నేర ప్రవృత్తి గల అజార్ వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామ నివాసి. అల్లరిచిల్లరగా తిరుగుతూ అమ్మాయిలను ఆటపట్టించే అజార్.. అనూష కంటే ముందు మరో అమ్మాయిని ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసినట్లు స్థానికులు చెప్పారు. ఆ యువతి తండ్రి అజార్ చేష్టలకు ఆత్మహత్య చేసుకున్నా.. ఆ అమ్మాయిని ఆ రాక్షసుడు వదల్లేదని తెలిపారు. అతణ్నుంచి తప్పించుకుని బంధువుల ఇంటికి వెళ్లిన ఆ అమ్మాయిని అక్కడా అజార్ వేధించడంతో చివరకు పోలీసులను ఆశ్రయించిందని వెల్లడించారు. పోలీసులు అజార్‌ను తీవ్రంగా మందలించి వదిలేయడంతో మళ్లీ ఇప్పుడు అనూష వెంటపడ్డాడు. ఆమె తన ప్రేమను తిరస్కరించడంతో కక్ష పెంచుకున్న అజార్ ఆమె గొంతు కోశాడు. ప్రాణాపాయం తప్పినా.. జరిగిన ఘటన తాలూకు షాక్ నుంచి కోలుకోవడానికి ఆమెకు, అనూష కుటుంబానికి చాలా సమయమే పడుతుంది.