woman Generating Employment to 20 Women: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్‌కు చెందిన కోదాటి పుష్పలత అనే మహిళ సాధారణ రైతు. రైతు కుటుంబంలో ఎన్ని బాధలుంటాయో.. పుష్పలత అవన్నీ చూసింది. ఎన్నో ఒడిదొడుకలతో గడుస్తున్న కుటుంబానికి తాను కాస్త ఆసరా కావాలనుకుంది. మహిళలు.. స్వశక్తితో ఎదగాలనే తపన ఆమెది. అందుకే ఆర్థికంగా తాను నిలదొక్కుకోవడమే గాకుండా.. కుటుంబానికి ఆధారమవ్వాలని నిర్ణయించుకుంది. అందుకే టైలరింగ్ పని చేస్తూ.. తనతో పాటు మరికొంత మందికి ఆ పని నేర్పింది.
టైలరింగ్‌తో ఆపితే మనం ఆమె గురించి ఎందుకు చెప్పుకుంటామిప్పుడు. దీంతో పాటు ఇంకా ఏదో చేయాలని తపన పడింది. అందులో భాగంగానే పుష్పలత.. పిండి వంటలు చేసి డబ్బు సంపాదించాలనుకుంది. ఇంట్లో పిండివంటలు చేయటం సహజం. అయితే అవసరమున్నవారికి మంచి రుచితో చేసివ్వాలనే ఆలోచనతో ముందడుగు వేసింది పుష్పలత. ఇలా ప్రయత్నం ప్రారంభించగానే మంచి గిరాకీలు వచ్చాయి. తొలుత 5 గురు మహిళలతో ప్రారంభించింది. కావల్సిన పిండి పదార్ధాలను అనుకున్న సమయానికి వినియోగదారులకు అందించింది. ఇలా 5 గురితో ప్రారంభమై నేడు సుమారు 25 మంది మహిళలకు ఉపాధిని కల్పిస్తుంది.
ఇంట్లో, వివాహా శుభకార్యాలకు ఎటువంటి పిండిపదర్ధాలు ఏ సైజులో కావాలన్నా ఆ సైజులో తయారు చేస్తున్నారు. అనుకున్న సమయానికి కస్టమర్లకు చేరవేస్తున్నారు. విపణిలో ఉన్న ధర కంటే చాలా తక్కువ ధరకు అందించటంతో భలే గిరాకీ వస్తుంది. ఆ మహిళలకు చేతినిండా పని దొరుకుతుంది. సకినాలు, లడ్డు, అరిసెలు, గారెలు, మడుగులు, చెకోడీలు ఇలా సుమారు 60 రకాల వరకు పిండివంటలు తయారు చేస్తున్నారు. చిన్న సైజు నుంచి వినియోగదారులకు కావల్సినంత సైజు వరకు తయారు చేయటం వీరి ప్రత్యేకత.
'ప్రస్తుతం 25 మందితో ఈ కుటీర పరిశ్రమను నడిపిస్తున్నా. మాది రైతు కుటుంబమే. మహిళలకు చాలా కష్టాలుంటాయి. వారికి ఖర్చులుంటాయి. ఇంటి అవరసరాలకు ఎంతగానో ఉపయోగపడుతాయి. గత పదిహేను సంవత్సరాలుగా చేస్తున్నా.'-కోదాటి పుష్ప, నిర్వాహకురాలు