తెలంగాణ ముద్దుబిడ్డ పాములపర్తి వెంకట నర్సింహారావు. ఆ మహానీయుని శతజయంతి వేడుకలను ఏడాది పొడవునా నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ ముద్దుబిడ్డ పీవీ జీవిత విశేషాలపై ప్రత్యేక కథనం.
పూర్వ కరీంనగర్, ప్రస్తుత వరంగల్ అర్బన్ జిల్లా, భీమదేవరపల్లి మండలంలోని వంగరలో జన్మించి దేశ ప్రధాని పీఠాన్ని అధిష్టించిన దివంగత నేత పీవీ నర్సింహారావుకు తెలంగాణ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయే గుర్తింపు ఇవ్వనుంది. ఆ మహానీయుని జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు రాష్ట్ర సర్కారు సమాయత్తం అవుతోంది. సీఎం కేసీఆర్ ఆదేశాలపై... ఈనెల 28 నుంచి పీవీ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆయన స్వగ్రామం వంగరలోని ఇంటిని మ్యూజియంగా మార్చే పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రధానిగా ఉన్నప్పుడు ఉపయోగించిన వస్తువులను ప్రదర్శనకు ఉంచనున్నారు. మౌన మునిగా గుర్తింపు పొందిన పీవీని... నేటి తరానికి పరిచయం చేసేందుకు ఈ మ్యూజియం ఎంతో దోహద పడుతుందని స్థానికులు అంటున్నారు.
పీవీ నరసింహారావు తండ్రి కట్టించిన ఇల్లుఇది. దీన్ని నిర్మించి సుమారు వందేళ్లు పైబడి అవుతుంది. దీనిని మ్యూజియం చేయాలనుకుంటున్న సందర్భంగా ఆయన వాడిన వస్తువులను దిల్లీ, హైదరాబాద్ నగరాలనుంచి తీసుకొచ్చాం. సుమారు 300 వస్తువులు ఉంటాయి.
-రాయపురెడ్డి, వంగర నివాసి
సంస్కరణల సృష్టికర్త పీవీకి దాదాపు పదహారేళ్ల తర్వాత సరైన గౌరవం దక్కుతోందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బంధుప్రీతి అసలు లేదని.. నిక్కచ్ఛిగా వ్యవహరించే వారని, నిజాయితీగా సేవలందించారని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రానికి, దేశానికి ఎన్నో సేవలందించిన పీపీకి సరైన గౌరవం దక్కలేదనే బెంగ ఇన్నిరోజులు వెంటాడిందని చెబుతున్నారు.
దేశ ప్రధానిగా చేసిన పీవీ నరసిహారావు మా గ్రామనికి చెందిన వ్యక్తి కావడం మా అందరికీ గర్వకారణం. ఆయనకు భారతరత్న ఇవ్వాలని మేమంతా కోరుకుంటున్నాం. పీవీ శతజయంతి వేడుకలను ఏడాది పాటు నిర్వహించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం పట్ల మేమంతా సంతోషం వ్యక్తం చేస్తున్నాం.
-కండె రమేశ్, మాజీ సర్పంచి, వంగర.