మనమే గెలుస్తాం.. అయినా అలసత్వంగా ఉండొద్దన్న కేసీఆర్ హెచ్చరికలు.. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడి ప్రణాళిక, మంత్రుల నుంచి కార్యకర్తల వరకు ముమ్మర ప్రచారం... తెరాస విజయానికి బాటలు వేశాయి. దాంతోపాటు మూడు జిల్లాల్లో అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి సుడిగాలి పర్యటనలు.. నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల స్థానాన్ని అధికార పార్టీ ఖాతాలో వేశాయి. మెరుగైన పీఆర్సీ ఇస్తామన్న ప్రకటన, లక్షా 31 వేలకుపైగా ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పడం, లెక్కలతో సహా వివరించడం, మరో 50 వేల ఖాళీల భర్తీ ప్రకటనా కలిసివచ్చాయి. ఇతర సమస్యలపై వ్యూహాత్మకంగా వ్యవహరించడం.. దిద్దుబాటు చర్యలు తీసుకోవడం వల్ల వ్యతిరేకత స్థాయి తగ్గింది.
ప్రశ్నించే గొంతుక కాదు..
ప్రశ్నించే గొంతుక కాదు.. పరిష్కరించే గొంతుకనవుతా అంటూ తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి.. మూడు జిల్లాల్లోనూ విస్తృతంగా పర్యటించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులతో సమావేశాలు నిర్వహించారు. తెరాసకు ఓటేస్తే కలిగే ప్రయోజనాలను వివరించి.. అనుకూల ఓట్లను రాబట్టడంలో విజయం సాధించారు.
తెరాస పోల్ మేనేజ్మెంట్..
అన్నింటికీ మించి తెరాసకు తెలిసిన పోల్ మేనేజ్మెంట్ ఈ ఎన్నికల్లో కలిసొచ్చింది. మొదటి ప్రాధాన్యత ఓట్లతో నెగ్గకపోయినా.. కావాల్సినంత మెజార్టీ తెచ్చుకోవడం వల్ల పల్లాకు గెలుపు సునాయాసమైంది. ఇదే సమయంలో.. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతో గట్టెక్కాలన్న ప్రత్యర్థుల వ్యూహం బెడిసికొట్టింది. అధికార పక్ష అభ్యర్థికి దీటుగా.. రెండో ప్రాధాన్యత ఓట్లను తెచ్చుకోవడంలో విఫలమయ్యారు.పేరుకే పట్టభద్రుల ఎన్నికైనా.. శాసనసభ ఎన్నికల స్థాయిని తలపించింది. పోటాపోటీ ప్రచారాలు.. పరస్పర సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఎన్నికల సమరం ఆద్యంతం రసవత్తరంగా సాగింది.
కమలానికి భంగపాటు..
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల విజయాలతో జోరుమీదున్న కమల దళానికి.. ఈ ఎన్నికలు ఊహించని భంగపాటు కలిగించాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చూపి.. గులాబీ నేతలను ఇరుకున పెట్టాలనుకున్న భాజపా నేతల వ్యూహం బెడిసికొట్టింది. అనుకున్న రీతిలో పోటీ ఇవ్వలేక చతికిలపడ్డారు కమలనాథులు. తొలి నుంచి ఓట్ల లెక్కింపులో ఆ పార్టీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డి.. నాలుగో స్థానానికే పరిమితమయ్యారు. గెలుపుపై అతివిశ్వాసం.. పట్టభద్రుల మద్దతు పొందేందుకు అవసరమైన వ్యూహరచనలో వైఫల్యం, కాషాయ నేతలకు ఓటమి తెచ్చిపెట్టింది.
అదే కోదండరాంకు మైనస్..
తెలంగాణ సాధనలో ఎంతో కృషి చేసినా.. సుపరిచితుడిగా, మేథావిగా పేరు తెచ్చుకున్న తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం విజయం సాధించలేకపోయారు. ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగుల మద్దతుతో గెలుపొందాలన్న కోదండరాం ఆశలు నెరవేరలేదు. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతో కోదండరాం.. విజయం సాధిస్తారన్న విస్తృత ప్రచారమే మిగిలింది. సభలు, సమావేశాలు నిర్వహించి కోదండరాం ప్రచారం చేసినా.. క్షేత్రస్థాయిలో ఓట్లు వేయించగలిగే క్యాడర్ లేకపోవడం పెద్ద మైనస్ పాయింటైంది. రెండో స్థానంలోనైనా ఉంటారని భావించినా.. తొలిరౌండ్ నుంచీ మూడో స్థానానికే పరిమితమయ్యారు.