తెలంగాణ

telangana

ETV Bharat / state

స్వచ్ఛ ఆటోల కొనుగోళ్లలో జాప్యమెందుకో..? - వరంగల్​ జిల్లాలో పడకేసిన పారిశుద్ధ్యం

పారిశుద్ధ్యాన్ని పూర్తి స్థాయిలో మెరుగుపర్చడానికి ఉపయోగపడే స్వచ్ఛ ఆటో(ట్రాలీ)లు పురపాలక సంఘాలకు రావడం లేదు. వీటికి పట్టణ ప్రగతి నుంచి నిధులను కేటాయించినా కొనుగోళ్లలో జాప్యం చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఉన్నతాధికారులు సైతం పట్టించుకోనందునే ఈ పరిస్థితి ఏర్పడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరంగల్​ జిల్లాలోని మూడు పురపాలక సంఘాల్లో ఈ పరిస్థితి నెలకొంది.

watrangal district
స్వచ్ఛ ఆటోల కొనుగోళ్లలో జాప్యమెందుకో..?

By

Published : Jul 29, 2020, 12:11 PM IST

వర్షాలతో చెత్తాచెదారం తడిసిపోయి కాలనీల్లో దుర్వాసన వెదజల్లుతోంది. చెత్త ఆటోలకు నిధులు కేటాయించిన కొనడానికి తాత్సారం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏది ఏమైనా పారిశుద్ధ్యంలో సమస్యలు లేకుండా తడి, పొడి చెత్త సేకరణను వేర్వేరుగా వంద శాతం సేకరించాలనే లక్ష్యానికి పురపాలక సంఘం చేరువ కావడం లేదు.

వర్ధన్నపేటలో:.. వర్ధన్నపేట పురపాలక సంఘంలో పట్టణ ప్రగతి కంటే ముందే నాలుగు స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేశారు. అందుకోసం రూ.10.40లక్షలను వెచ్చించగా బిల్లుల చెల్లింపులో నిమగ్నమయ్యారు. ఇక్కడ డంపింగ్‌ యార్డు సైతం ఉండగా పట్టణానికి దూరంగా ఉండటం ఇబ్బందులకు గురి చేస్తోంది.

పరకాలలో:.స్థానికంగా మొత్తం మూడు ట్రాక్టర్లుండగా కార్మికులు నిత్యం పట్టణంలో సేకరించిన చెత్తను ఆ ట్రాక్టర్లలో పట్టణానికి దూరంగా తరలిస్తున్నారు. డంప్‌యార్డు లేనందున దామెర చెరువు వద్ద, భూపాలపల్లి రోడ్డులో ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేస్తున్నారు. ఇటీవలనే స్థల సేకరణ చేయగా డంప్‌ యార్డును ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో చెత్తను తీసుకెళ్లే ట్రాక్టర్లు పెద్దవిగా ఉండటంతో కాలనీల్లో తిరగలేని పరిస్థితులున్నాయి. ఆ కారణంగా తడి, పొడి చెత్త సేకరణ సరిగా జరగడం లేదు. పారిశుద్ధాన్ని పూర్తి స్థాయిలో మెరుగుపర్చడానికి నాలుగు చక్రాల స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేయాలని పాలకవర్గం గతంలోనే తీర్మానం చేసింది. ఒక్కో ఆటోకు రూ.7లక్షలు కేటాయించగా మొత్తం పది ఆటోలకు రూ.70 లక్షలు, ఒక ట్రాక్టర్‌(ఇంజిన్‌)కు రూ.4 లక్షలు, నీటి ట్యాంకర్‌కు రూ.లక్ష చొప్పున మొత్తం రూ.75లక్షలు ఖర్చు చేయాల్సి ఉంది. ఓ కంపెనీకి చెందిన వాటిని కొనుగోలు చేయాలని పత్రాలన్ని సిద్ధం చేయగా గత నెలలోనే కొనుగోలు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇంత వరకు స్వచ్ఛ ట్రాక్టర్లు జాడ లేకుండా పోయాయి.

నర్సంపేటలో:..నర్సంపేటలో చెత్త సేకరణకు నాలుగు ట్రాక్టర్లు, ఆరు స్వచ్ఛ ఆటో ట్రాలీలున్నాయి. ఇంటింటి చెత్త సేకరణ వంద శాతం జరగాలని మరిన్ని ట్రాక్టర్లు, ఆటోలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు ప్రతిపాదనలు తయారు చేసి కొత్తగా ఆరు స్వచ్ఛ ఆటోలు, రెండు ట్రాక్టర్లు, రెండు ట్రాలీలు, రెండు ట్యాంకర్లను కొనాల్సి ఉంది. వీటికి రూ.65 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా. గత నెలలో ఈ ప్రతిపాదనలు తయారుచేయగా కొనుగోళ్లలో జాప్యమవుతోంది. ఇదే సమయంలో డంపింగ్‌ యార్డు సమస్య వెంటాడుతోంది. ప్రస్తుతం తీసిన చెత్తను పట్టణానికి దూరంగా పాకాల రోడ్డులో రాజుపేట సమీపంలో పోస్తున్నారు. అవసరమైన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కోరుతుండగా ఎట్టకేలకు అశోక్‌నగర్‌ శివారులోని నాలుగు ఎకరాల స్థలాన్ని గుర్తించారు. కానీ ఇంకా స్థల అప్పగింత ప్రక్రియ పూర్తి కాలేదు. స్థలాన్ని అప్పగించినట్లయితే డంపింగ్‌ యార్డు నిర్మాణ పనులకు మార్గం సుగమం అవుతుంది.

ఆయా పురపాలక సంఘాల్లో కొనుగోలు చేయనున్న వాటి వివరాలు...

నర్సంపేట

  • 6 స్వచ్ఛ ఆటోలు
  • 2 ట్రాక్టర్లు
  • 2 ట్రాలీలు
  • 2 ట్యాంకర్లు
  • రూ. 65 లక్షలు

పరకాల

  • 10 స్వచ్ఛ ఆటోలు
  • 1 ట్రాక్టర్‌
  • 1 ట్యాంకర్‌

రూ. 75 లక్షలు

ప్రతిపాదనలు

వ్యయం(అంచనా)

వారంలో కొనుగోలు ప్రక్రియ పూర్తి..

పది స్వచ్ఛ ఆటోలు, ఒక ట్రాక్టర్‌, మరో ట్యాంకర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంది. అందుకు కావాల్సిన నిధులను కేటాయించాం. ఇటీవలనే కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయింది. వారంలోగానే కొనుగోలు చేసి వాటిని తెప్పిస్తాం. - బి.యాదగిరి, పరకాల పురపాలక కమిషనర్‌

కలెక్టర్‌ అనుమతి లభించిన వెంటనే...

ఆరు ఆటోలు, రెండు ట్రాక్టర్లు(ఇంజిన్లు), రెండు ట్రాలీలు, రెండు ట్యాంకర్లను కొనుగోలు చేయాల్సి ఉంది. ప్రతిపాదనలు సిద్ధం చేయగా కలెక్టర్‌ అనుమతి రావాలి. వచ్చిన వెంటనే కొనుగోలు చేస్తాం. - సురేశ్‌, నర్సంపేట పురపాలక ఏఈ

ABOUT THE AUTHOR

...view details