కేయూ ఉపకులపతి పీఠం ఎవరికి దక్కేనో..? కాకతీయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆర్.సాయన్న పదవీకాలం బుధవారం సాయంత్రంతో ముగిసింది. 2016లో రాష్ట్రంలోని 8 విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమించగా... ఉస్మానియా విశ్వవిద్యాలయం భౌతికశాస్త్రం విశ్రాంత ఆచార్యులు సాయన్న కేయూ 13వ ఉపకులపతిగా నియమితులయ్యారు.
మూడేళ్లలో ఎంతో అభివృద్ధి:
సాయన్న సారథ్యంలోనే వర్సటీ న్యాక్ ఏ గ్రేడు గుర్తింపును సాధించగలిగింది. పచ్చదనం కలిగిన విశ్వవిద్యాలయాల్లో దేశంలో 12వ ర్యాంకు, తెలుగు రాష్ట్రాల్లో ప్రథమ స్థానాన్ని వర్సటీ దక్కించుకుంది. రూ.28 కోట్లతో నూతనంగా వసతి గృహాలు... అదనపు తరగతి గదుల నిర్మాణం, ప్రయోగశాలల ఆధునికీకరణ, ఇతర అభివృద్ధి పనులకు మొత్తం రూ.100 కోట్ల వరకు వెచ్చించారు. 250 అధ్యాపక ఉద్యోగాలు ఖాళీగా ఉండగా... 136 ఉద్యోగాల భర్తీకి అనుమతులు తీసుకొచ్చారు. ప్రతిష్ఠాత్మక కేయూ వీసీగా చేయడం తన అదృష్టమని.. మూడేళ్ల పదవీకాలం తనకు పూర్తి సంతృప్తి ఇచ్చిందని సాయన్న తెలిపారు.
ఆందోళనలతో హోరెత్తిన వర్సిటీ:
ఇదే సమయంలో విద్యార్థుల ఆందోళనలకు వేదికగా కేయూ నిలవడమూ గమనార్హమే. వీసీ వెళ్లిపోతున్న సమయంలోనే విద్యార్థులు పరిపాలనాభవనం ముందు కొబ్బరికాయలు కొట్టారంటే పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. వర్సటీ పాలన పూర్తిగా గాడి తప్పిందన్న విమర్శలు వెల్లువెత్తాయి.
కొత్త అధ్యాపక ఉద్యోగాల అనుమతి వచ్చినా భర్తీ కాలేదు. మూడేళ్ల కాలంలో ఒక్కసారి మాత్రమే పీహెచ్డీ, ఎంఫిల్ ప్రవేశాల ప్రక్రియ పూర్తి కాగా అదీ తప్పుల తడకగా మారింది. మార్కుల జాబితాల్లో దొర్లిన తప్పులు కేయూ ప్రతిష్ఠను దిగజార్చాయి. విద్యార్థులు ఆందోళనలకు దిగడం వల్ల... వాటిని సవరించి మళ్లీ ఫలితాలను వెల్లడించారు. మిగతా విశ్వవిద్యాలయాలతో పోలిస్తే.. పీహెచ్డీ ఫీజులు భారీగా ఉన్నాయన్న కారణంతో విద్యార్థులు ఇప్పటికీ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఐసెట్ ఫలితాలను కూడా వెల్లడించకుండా విద్యార్థులు అడ్డుకున్నారు. నిత్యం ధర్నాలు... నినాదాలతో వర్సిటీ మారుమోగుతోంది.
ఎవరికి దక్కేనో?
సాయన్న పదవీకాలం పూర్తికావడం వల్ల.. ఇక కేయూకు కొత్త వీసీ ఎవరన్న దానిపైన చర్చ మొదలైంది. ఇప్పటికే వర్సిటీకి చెందిన రెగ్యులర్, విశ్రాంత ఆచార్యులు మొత్తం 25 మంది వీసీ రేసులో ఉన్నారు. స్థానికులనే విశ్వవిద్యాలయ ఉపకులపతిగా నియమించాలన్న డిమాండ్ క్రమేపి అధికమౌతోంది. మరి వర్సిటీకి చెందిన వారినే నియమిస్తారా... లేదా వేరే విశ్వవిద్యాలయానికి చెందినవారికి అవకాశమిస్తారా అన్నది తేలాల్సి ఉంది.
ఇదీ చూడండి: లోక్సభలో చర్చకు తలాక్ బిల్లు- నేడు ఆమోదం!