వరంగల్లోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్‌లో ఇంజినీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు పశ్చిమ్ బంగకు చెందిన కౌశిక్ పాండేగా గుర్తించారు. మృతుడు మొదటి సంవత్సరం ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ విభాగంలో నిట్‌లో టాప్ ర్యాంక్ సాధించగా... రెండో ఏడాది కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్లోకి మారాడు. అందులో నాలుగు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. వారం రోజుల క్రితం ఇంటికి వెళ్లిన కౌశిక్.. తన తండ్రితో కలిసి నిన్న హాస్టల్కు వచ్చాడని నిర్వాహకులు తెలిపారు.
మానసిక ఒత్తిడితోనేనా?
విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సమయంలో అతని తండ్రి వసతిగృహం బయటే ఉన్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. విద్యార్థి సూసైడ్ నోట్లో హిందీలో గాయత్రి మంత్రాన్ని రాసినట్లు పోలీసులు తెలిపారు. సబ్జెక్ట్లు ఫెయిల్ అయ్యాయనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడా... లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. సహచర విద్యార్థులు మాత్రం అధికారుల నిర్లక్ష్యం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. 2017లో ప్రవేశ పెట్టిన ఫోర్ పాయింటర్ విధానం వల్ల మెరిట్ విద్యార్థులు కూడా సబ్జెక్ట్లు తప్పి మనోవ్యధకు గురవుతున్నారని విద్యార్థులు స్పష్టం చేశారు. చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ... అందరితో కలిసి మెలిసి ఉండే కౌశిక్ లాంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం తమని కలిచి వేసిందని అధ్యాపకులు వెల్లడించారు.
వరంగల్ నిట్‌లో విద్యార్థి ఆత్మహత్య ఇవీచూడండి: 'దేశం గొప్ప నాయకురాలిని కోల్పోయింది '